శబరిమలలో మహిళల ప్రవేశానికి రెండు రోజులు.. కేరళ సర్కార్

శుక్రవారం, 23 నవంబరు 2018 (19:00 IST)
శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. మహిళల ప్రవేశంపై ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 144 సెక్షన్ అమలులో వుంది. దీంతో శబరికి వచ్చే భక్తులు శరణు ఘోష చేయొద్దని.. గుంపులుగా వెళ్ళొద్దని పోలీసులు నిబంధనలు విధించారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతుందని కొందరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై హైకోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది. భక్తులపై ఆంక్షలు విధించవద్దని, కఠినంగా వ్యవహరించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 144 సెక్షన్‌ను కొనసాగించి.. ఆలయ పరిసరాల్లో శాంతి భద్రతలను కాపాడాలని హైకోర్టు సూచించింది. 
 
మరోవైపు శబరిమల వద్ద మహిళల ప్రవేశానికి ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించినట్లు కేరళ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఇంకా కేరళలోని శబరిమలలో సుప్రీం ఆదేశాల మేరకు మహిళల ప్రవేశంపై చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ సర్కారు హైకోర్టుకు హామీ ఇచ్చింది. 
 
శబరిమల సందర్శనకు పోలీసుల రక్షణ కోరుతూ కేరళ హైకోర్టులో నలుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వారు ఆలయ ప్రవేశించేందుకు రక్షణ ఇవ్వాలని, రిజర్వ్ రోజులను నిర్ధారించాలని సూచించింది. 
 
శబరిమల డిసెంబర్ 26వ తేదీ వరకు తెరిచి వుంటుంది. జనవరి 20 వరకు వార్షిక తీర్థయాత్రల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరిచి వుంటుందని కేరళ హైకోర్టుకు తెలిపింది. ఇందులో భాగంగా శబరిమలకు మహిళల ప్రవేశం కోసం రెండు రోజులు కేటాయించనున్నట్లు కేరళ సర్కారు స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు