నేను పని రాక్షసుడిని.. కష్టపడి పని చేయడి లేదా రాజీనామాలు చేసి ఇంటికెళ్లండి: సీఎం యోగి

సోమవారం, 27 మార్చి 2017 (09:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేరుకేలోని ఝులక్ ఇచ్చారు. తాను పని రాక్షసుడిని అంటూ హెచ్చరించారు. ఉద్యోగులు కూడా కష్టపడి పని చేయాల్సిందేనని లేకుంటే రాజీనామాలు చేసి ఇంటికెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. 
 
ఆదివారం గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... పొద్దున్నే పది గంటలకో, పదకొండు గంటలకో తాపీగా ఆఫీసుకు రావడం, టీ తాగేసి, కబుర్లు చెప్పుకోవడం, మధ్యాహ్నం భోజనం, ఆపైన విసుగేస్తే, కాసేపు కునుకేసి, సాయంత్రం 5 కాగానే ఇంటికి వెళ్లిపోదామని భావించే ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై తమ అలవాట్లను మార్చుకోవాలన్నారు. 
 
నిత్యమూ 18 నుంచి 20 గంటల పాటు ఉద్యోగులు పని చేయాల్సి వుంటుందని, అలా కుదరదని అనుకుంటే రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. తాను ఓ పని రాక్షసుడినని, అధికారులూ అలాగే ఉండాలని కోరుకుంటున్నానని, కష్టపడని వారికి ఇక్కడ స్థానం ఉండదని చెప్పారు. పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి