వరలక్ష్మీ పూజ ద్వారా కోరిన వరాలు పొందవచ్చు. కన్యలకు నచ్చిన భర్త కావాలంటే... వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరాలంటే తప్పకుండా వరలక్ష్మీ వ్రతం చేయాల్సిందే.. అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. ఈ ఏడాది ఆగస్టు 4 (2017) శుక్రవారం వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే మహిళలు శుభముహూర్తాన్ని తెలుసుకోవడం మంచిది.
వరలక్ష్మీ వ్రతం రోజున సమర్పించాల్సిన నైవేద్యాలు...
వరలక్ష్మీ వ్రతం రోజున ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. శుభ్రతను ఇష్టపడే మహాలక్ష్మీ ఇంట నివాసం వుండాలంటే.. శుచిగా వుండాల్సిన నియమం వుంది. ఇంటిని, పూజా గదిని పువ్వులు, తోరణాలతో అలంకరించుకోవాలి. అలాగే మహాలక్ష్మీకి సమర్పించే నైవేద్యాలు శుచిగా వుండాలి. ఇంట్లో తయారు చేసినవిగా వుంటే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు. తీపి పదార్థాలను అమితంగా ఇష్టపడే శ్రీదేవికి రవ్వలడ్డూలు, అటుకుల లడ్డు, స్వీట్ పొంగలి, పాయసం, రవ్వ కేసరి, చలిమిడి, సొరకాయ పాయసం, చంద్రకాంతులు, బెల్లం గారెలు, బూరెలు, పాల ముంజలు, బొబ్బట్లు, తీపి అటుకులు, పులిహోర, తాలింపు శెనగలు, గారెలు వంటివి సమర్పించుకోవచ్చు.