శ్రీవారి దివ్యరూపం అంతలా వెలిగేందుకు కారణమేంటో తెలుసా..?

శుక్రవారం, 20 ఆగస్టు 2021 (23:05 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి దివ్యమంగళం స్వరూపం భక్తులకు అంత స్పష్టంగా ఎలా కనిపిస్తుంది. 50 అడుగుల దూరంలోను భక్తులు స్వామివారిని ఎలా దర్సించుకుంటున్నారు. ఇందుకోసం టిటిడి తీసుకుంటున్న చర్యలేంటి..? 
 
తిరుమల శ్రీవారి దర్సనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. వైకుంఠం నుంచి విచ్చేసిన స్వామివారు ఆనంద నిలయంలో స్వయంభుగా వెలిశారు. సాలిగ్రామమూర్తిగా భక్తులకు దర్సనమిస్తున్నారు. 
 
12.9 అడుగుల చతురస్త్ర ఆకారంలో ఉండే గర్భాలయంలో స్వామివారు కొలువుదీరారు. ఎనిమిదిన్నర అడుగుల ఎత్తులో స్వామవారి దివ్యరూపాన్ని భక్తులు 50 అడుగుల దూరం నుంచే వీక్షిస్తున్నారు. గతంలో భక్తులకు కులశేఖర పడివరకు అనుమతించేవారు.
 
అప్పట్లో స్వామివారిని అడుగు దూరం నుంచి వీక్షించే మహద్భాగ్యం భక్తులకు లభించేంది. అయితే శ్రీవారి దర్సనానికి భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుండడంతో 1982 సంవత్సరంలో రాముల వారి మేడకు పరిమితం చేశారు. శయన మండపం దాటిన తరువాత స్వామివారి ఆభరణాలను భద్రపరిచే రాములవారి మేడ ప్రాంతం నుంచే దర్సించుకునేవారు. అంటే 23 అడుగల దూరం నుంచి స్వామివారిని దర్సించుకునే అవకాశం ఉంది. ఇక కాలక్రమేణా శ్రీవారి దర్సనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 
 
దీంతో భక్తులను జయవిజయల గడప వద్దకే పరిమితం చేసింది. 2004 సంవత్సరంలో మహాలఘు దర్సనాన్ని అమల్లోకి తీసుకొచ్చింది టిటిడి. భక్తులు 50 అడుగుల దూరం నుంచే స్వామవారిని దర్సించుకోవాల్సి ఉంటుంది. ఇలా స్వామివారిని దర్సించుకునే అడుగుల దూరం పెరుగుతూనే ఉన్నా శ్రీనివాసుడి దివ్యస్వరూపం భక్తులు దర్సించుకునే బ్రహ్మ అఖండ దీప కాంతుల్లోనే. గర్భాలయంలోని ఈశాన్యం, ఆగ్నేయం వైపున అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి. సుప్రభాత సేవలో సన్నిధిగొల్ల తీసుకొచ్చే దివిటీలతో వీటిని అర్చకులు ప్రజ్వలన చేశారు.
 
తిరిగి ఏకాంత సేవ  సమయంలో కొండెక్కిస్తారు. వీటి వెలుగులోనే భక్తులు స్వామివారిని దర్సించుకుంటున్నారు. వీటిని వెలిగించడానికి నిత్యం 30కేజీల నెయ్యిని వినియోగిస్తోంది టిటిడి. ఇకపై దేశీయ గోవుల ద్వారా తయారయ్యే నెయ్యినే వినియోగించాలని భావిస్తోంది టిటిడి. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా దేశీయ గోవులను సంరక్షిస్తూ వాటి ద్వారా టిటిడి నెయ్యిని తయారుచేసేలా గోశాలను అభివృద్ధి చేస్తోంది. ఇలా గోవిందుడు గోవుల ద్వారా తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యితో వెలిగించిన దీపపు కాంతుల్లోనే భక్తులకు దర్సనభాగ్యం కల్పిస్తోంది టిటిడి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు