వృద్ధుడిని పోపో అని కసిరిన భర్త, వజ్రపు ముక్కుపుడక దానం చేసిన భార్య

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (22:51 IST)
పూర్వం మైసూరు రాజ్యంలో శ్రీనివాసుడు అనే నగల వ్యాపారి వుండేవాడు. అతనికి బంగారం మీది విపరీతమైన ఆశ. ఓరోజు అతడి వద్దకు ఓ వృద్ధుడు వచ్చాడు. తనకు ఏమయినా వుంటే దానం చేయమన్నాడు. తన వద్ద ఏమీలేదు పొమ్మన్నాడు శ్రీనివాసుడు.
 
కానీ ఆ వృద్ధుడు ఆ తర్వాత శ్రీనివాసుడు అలా ఇంటి నుంచి వెళ్లిపోగానే అతడి భార్యను ఏదయినా ఇమ్మని అడిగాడు. ఆమె కడు దయకలది. తన వద్ద వున్న వజ్రపు ముక్కుపుడక తీసి ఇచ్చి, దానితో అవసరం తీర్చుకోమని చెప్పింది. వృద్ధుడు ఆ ముక్కుపుడకను తీసుకుని నేరుగా శ్రీనివాసుడు నగల దుకాణానికి వెళ్లి అమ్మకానికి పెట్టాడు. అది చూసిన శ్రీనివాసుడు అది తన భార్యదేనని తెలుసుకున్నాడు.
 
వృద్ధుడిని అక్కడే వుండమని చెప్పి ముక్కుపుడక తీసుకుని ఇంటికి వెళ్లాడు. తన భర్త ఆగ్రహంతో ఇంటికి రావడం చూసి ఇక తనను బ్రతకనివ్వడని భావించి విషం తాగేందుకు పాత్రను తీసింది. ఆశ్చర్యకరంగా అందులో తన వజ్రపు ముక్కుపుడక దర్శనమిచ్చింది. ఆ ముక్కుపుడకను ఆమె ధరించింది.
 
తన భార్యను ప్రశ్నించాలనుకున్న శ్రీనివాసుడు భార్య ముక్కుకు ముక్కెర వుండటంతో అదంతా దైవలీలగా భావించాడు. అప్పటి నుంచి తన వద్దనున్న సంపదనంతా పేదలకు దానధర్మాలు చేసేవాడు. ఆ శ్రీనివాసుడు అలా పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు. పురందరదాసు మరెవరో కాదు సాక్షాత్తూ నారద మహర్షి. ఆయనను పరీక్షించేందుకు వృద్ధుడి రూపంలో వచ్చింది శ్రీమహావిష్ణువు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు