మనసు మందిరంలో ప్రేమ అడుగుపెట్టిన వేళ

Munibabu

గురువారం, 17 జులై 2008 (19:49 IST)
ప్రేమ అనే అనీర్వచనీయమైన భావాన్ని వర్ణించడానికి వీలుకాదు. ప్రేమలో పడ్డామని ఎవరైనా అంటే అది విన్న మనకు ఏదో జోకు విన్ని ఫీలింగ్ కలగవచ్చు. కానీ ప్రేమభావం అన్నది తమదాకా వస్తేగానీ అందులో ఉన్న తీవ్రత అర్ధం కాదు. అందుకే ప్రేమ, పిచ్చి ఒకలాంటివే అని అంటుంటారు.

పిచ్చివారి గురించి లోకం పట్టించుకోదు. వాళ్లకంటూ ఉన్న లోకం గురించి తప్ప బాహ్య ప్రపంచం గురించి పిచ్చివాళ్లు పట్టించుకోరు. అంతలా కాకపోయినా ప్రేమలో పడ్డవారు కూడా ఒక్కోసారి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి మరీ తమ ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనే భావం మనసులో ప్రవేశించి ఆ ప్రేమ లోగిళ్లలోకి అడుగుపెట్టిన సమయంలో మనిషికి లోకమే సరికొత్తగా కనిపిస్తుంది.
  యవ్వనంలో అడుగుపెట్టిన వేళ మనిషి శరీరంలో జరిగే రసాయన చర్యల ఫలితమే ప్రేమంటే... అంతే తప్ప మరేమీ లేదని యవ్వనం దాటేసిన పెద్ద మనష్యులు తీర్మాణాలు చేసేస్తుంటారు.      


ప్రేమభావంతో మనసు నిండిపోయిన వేళ ఎండిపోయిన మొక్కలో లేత చిగుళ్లు కనిపిస్తాయి. గుచ్చుకునే ముళ్లు సైతం మెత్తటి తివాచీలా అనిపిస్తుంది. ఇంతలా మనిషిని ప్రభావితం చేసే సమ్మోహన శక్తి ప్రేమకు మాత్రమే ఎందుకు ఉంది అన్నది యుగాలుగా, తరాలుగా మనిషినికి అంతు చిక్కకుండానే పోతోంది.

మనిషిని మార్చేటంతటి గొప్పశక్తి ప్రేమకు ఉందని నవీన శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకుంటున్నా దాని అంతేమిటో మాత్రం ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రేమ పేరుతో మోసాలు, వంచనలు జరుగుతున్నా ప్రేమ వలలో చిక్కుకుని జీవితాలే బలైపోతున్నా ప్రపంచంలో ప్రేమకు ఉన్న సమ్మోహన శక్తి ఏమాత్రం తగ్గడం లేదు.

కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నా, ఎన్నీ నవీన పోకడలు మనిషి దరిచేరుతున్నా రెండు మనసుల్లో అకస్మాత్తుగా పుట్టే ప్రేమభావం మాత్రం యుగాలుగా కొనసాగుతూనే ఉంది. నిజమైన ప్రేమ మనిషి గుండె తలుపు తట్టిన వేళ దానికోసం మనిషి ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటాడు.

యవ్వనంలో అడుగుపెట్టిన వేళ మనిషి శరీరంలో జరిగే రసాయన చర్యల ఫలితమే ప్రేమంటే... అంతే తప్ప మరేమీ లేదని యవ్వనం దాటేసిన పెద్ద మనష్యులు తీర్మాణాలు చేసేస్తుంటారు. ప్రేమంటే యవ్వనంలో కలిగే ఓ వ్యామోహం అని దానివల్ల జీవితాన్ని వ్యర్ధం చేసుకోవడం తప్ప మరో ఉపయోగం లేదని ఏనాడూ స్పందించని రాతి హృదయానికి ప్రతినిధులు నొక్కి వక్కాణిస్తుంటారు.

ఎవరెన్ని చెప్పినా, ఎవరేమి అనుకున్నా తనకేమీ పట్టనట్టు, తానేమీ విననట్టు మనసున్న మనిషి మనసులో చోటు సంపాదించుకోవడానికి ప్రేమ నిరంతరం ఎదురు చూస్తేనే ఉంటుంది. అదేమరి ప్రేమకున్న బలమంటే...

వెబ్దునియా పై చదవండి