అమెరికా వేదికగా జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరో తేలిపోయింది. సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సరికొత్త చరిత్రను లిఖించాడు. జకో కెరీర్‌లో ఇది ఆరో వింబుల్డన్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో, కెరీర్‌లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన ఇప్పుడు జకో కూడా చేరాడు.
వింబుల్డన్ ఫైనల్ పోటీలో ఇటలీ ఆటగాడు మటీయో బెరెట్టినిపై 6-7 (4-6), 6-4, 6-4, 6-3తో ఘనవిజయం సాధించాడు. ఈ టైటిల్ సమరంలో తొలి సెట్‌ను కోల్పోయిన జకోవిచ్ ఆ తర్వాత తన ట్రేడ్ మార్కు పట్టుదల ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌తో పాటు ఏకంగా టైటిల్‌ను సైతం కైవసం చేసుకున్నాడు.
జకోవిచ్ 15 బ్రేక్ పాయింట్లకుగాను ఆరింట విజయవంతం కాగా, బెరెట్టిన 7 బ్రేక్ పాయింట్ల ముంగిట రెండింటిని మాత్రమే కాపాడుకున్నాడు. తొలి సెట్‌ను టైబ్రేకర్ ద్వారా గెలిచిన బెరెట్టిని అదే ఊపును మిగతా సెట్లలో ప్రదర్శించలేకపోయాడు.