తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కనక వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు అమితాసక్తిని చూపుతున్నారు. దీంతో ఈ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయడంతో వీటిని సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడుతూ వేలం పాటల్లో పాల్గొంటున్నారు. దీంతో ఈ నంబర్లు భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి.
తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఓ ఫ్యాన్సీ నంబర్ వేలం పాటల్లో గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీజీ 09, 9999 అనే అంకెలతో కూడిన ఫ్యాన్సీ నంబర్‌ను ఓ కంపెనీ ఏకంగా రూ.25.50 లక్షలకు సొంతం చేసుకుంది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్ దీనిని దక్కించుకుంది. తమ టాయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్ కోసం ఈ భారీ మొతాన్ని వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబరు ఈ స్థాయిలో రేటు పలకడం ఇది తొలిసారి కావడం గమనార్హం.
కాగా, ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దీంతో కొన్ని ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్ వేలం పాటలను నిర్వహించారు. టీజీ09, 9999తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లను వేలం వేశారు. దీంతో తెలంగాణ ఆర్టీఏకి ఒకే రోజు ఏకంగా రూ.43.70 లక్షల ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.