తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లూ చకచక్ సాగుతున్నాయి. అయితే, రేవంత్ రెడ్డితో పాటు... ఈ ప్రమాణ స్వీకరోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా కాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరుకానున్నారు.
అలాగే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా వస్తున్నారు. ఇదిలావుంటే, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారి వివరాలను బయటకు పొక్కుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను, ఉప ముఖ్యమంత్రులుగా భట్టి విక్రమార్క, సీతక్కలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అలాగే, మంత్రులుగా పార్టీలోని సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేకా వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మల్‌రెడ్డి రంగారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి ముదిరాజ్, వీర్లబల్లి శంకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డికి చోటు కల్పించవచ్చని ప్రచారం సాగుతుంది.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత నంబర్ టెన్ జన్‌పథ్‌కు వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. అలాగే, రాష్ట్రంలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై సోనియా, రాహుల్‌తో రేవంత్ చర్చించనున్నారు.