తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలుపడ్డారు. షిప్టు కారులో వచ్చిన ఈ దొంగలు ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి రూ.30 లక్షల నగదును చోరీ చేసి పారిపోయారు. రంగారెడ్డి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ చోరీజరిగింది. ఈ చోరీకి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం ఉండగా, ఇక్కడకు కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పక్కా ప్లానింగ్‌తో చోరీ చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ మోగకుండా వైర్లు కట్ చేశారు. గ్యాస్ కట్టర్, ఇనుపరాడ్లుతో ఏటీఎంను బద్ధలు కొట్టి, నగదు పెట్టెతో సహా ఉడాయించారు. ఇదంతా కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.
ఇందుకోసం పక్కా ప్లాన్‌తో ఈ చోరులు అక్కడకు రావడం గమనార్హం. ఈ ఏటీఎంలో రెండు రోజుల క్రితమే రూ.30 లక్షల నగదును ఉంచినట్టు బ్యాంక్ మేనేజరు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వారే పక్కా ప్లాన్‌తో చోరీ చేసిటన్టు పోలీసులు భావిస్తున్నారు. చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో ఉంచగా, అది వైరల్ అయింది.