హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచింగ్ దొంగలు ఎక్కువైపోతున్నారు. సూటుబూటు వేసుకుని ఏదో ఒక సాకుతో ఇంట్లోకి వచ్చి మహిళల మెడలో ఉండే విలువైన బంగారు ఆభరణాలను లాక్కెళుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మంచినీళ్లు కావాలంటూ ముసుగు ధరించి వచ్చిన ఓ చైన్ స్నాచర్... మహిళ మెడలోని మంగళ సూత్రాన్ని లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
ఓ మహిళ ఉదయాన్నే నిద్రలేని ఇంటి వాకిలి శుభ్రం చేసి, ముగ్గు వేసుకుంటుంది. ఇంతలో ఓ యువకుడు ఖాళీ బాటిల్ తీసుకుని వచ్చి మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ వ్యక్తి ముఖానికి మంకీ క్యాప్ ధరించివున్నాడు. మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు ఇంటిలోకి వెళ్లగానే ఆ వ్యక్తి గేటు దాటుకుని ఇంట్లోకి ప్రవేశించాడు.
ఆ తర్వాత చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించి, ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని పారిపోయాడు. దీంతో ఆ మహిళ బిగ్గరగా అరుచుకుంటూ బయటకి వచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే ఆ దొంగ కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.