ట్రాఫిక్ పోలీసు నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ద్విచక్రవాహనదారుడు మృత్యువాతపడ్డాడు. దీంతో ఆగ్రహించిన మిగిలిన వాహనదారులు ఆ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌పై మండిపడ్డారు. ఈ ఘటన పెద్ద వివాదానికి దారితీయడంతో పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. అలాగే, మృతుడు సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఏపీలోని కోనసీమ అంబేద్కర్ జిల్లా గేదెల లంకవరానికి చెందిన ముమ్మిడవరపు జోషిబాను (32) ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి గాజుల రామారం - రుడామేస్త్రీ నగర్‌లో ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
పంజాగుట్టలో పని ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం బైకుపై జోషిబాబు బయలుదేరాడు. ఐడీపీఎల్ టౌన్‌షిప్ గేటు వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో నిమగ్నమైవున్నారు. దీంతో జోషిబాను బైకును కూడా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బైకును కుడివైపునకు తిప్పాడు. దీంతో వెనుక వస్తున్న బైకును ఢీకొట్టి మధ్యలో పడిపోయాడు.
ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక టైరు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరును నిరసిస్తూ స్థానికులు, వాహనదారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.