55 యేళ్ళ వృద్ధుడికి 22 యేళ్ల యువతితో పరిచయం, లాడ్జికి తీసుకుని వెళ్లి...

మంగళవారం, 8 అక్టోబరు 2019 (16:33 IST)
అది హైదరాబాద్ లోని పేరున్న పార్క్. సుబ్బారావు ఆ పార్కులో పర్యవేక్షకుడు. ప్రభుత్వ ఉద్యోగి. గత కొన్నినెలలకు ముందు పార్కులో ప్రేమికుల జంటలు ఎక్కువగా వచ్చేవారు. అయితే ఈమధ్య కాలంలో పోలీసులు పార్కులలో తిరుగుతూ ప్రేమికుల జంట ఎక్కడ కనబడినా వెంటనే వారిని హెచ్చరించి పంపించేస్తున్నారు.
 
ఎప్పటిలాగా వారం రోజుల క్రితం పార్కులో ఉద్యోగం కోసం వెళ్ళాడు సుబ్బారావు. అక్కడకు చిన్ని, రాజేష్ అనే ఇద్దరు లవర్స్ వచ్చారు. సుబ్బారావు పార్కులో కూర్చుని తన స్నేహితుడు పాండురంగారావుతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. పాండు నా దగ్గర ప్రస్తుతం చేర్చుకున్న డబ్బు అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఉంది. త్వరలోనే పదవీ విరమణ పొందుతున్నాను. మరికొంత డబ్బు వస్తుంది.
 
మొత్తం కలిపి నా కూతురు, కొడుక్కి ఇచ్చేస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇదంతా విన్నాడు రాజేష్. జల్సాలకు అలవాటుపడిన రాజేష్ అప్పుడప్పుడు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. తన ప్రియురాలు చిన్ని సహాయం కూడా తీసుకునేవాడు. ఈ సారి ఏకంగా సుబ్బారావుకే ఎసరు పెట్టాలని చూశారు. అతని దగ్గర డబ్బులు కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారు.
 
మరుసటి రోజు పార్కుకు చిన్ని చీర కట్టుతో ఒక బ్యాగు తీసుకుని వచ్చి కూర్చుంది. గంటకు పైగా ఒంటరిగా కూర్చోవడంతో సుబ్బారావు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏమ్మా.. ఎవరు నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటూ అడిగాడు. మాది అనంతపురం. మా ఆయన ఇల్లు వెతికేందుకు వెళ్ళాడు. కొద్దిసేపు పార్కులో కూర్చోమన్నాడు. ఇల్లు చూసి ఫోన్ చేస్తానని చెప్పినట్లు చిన్ని సుబ్బరావుకు చెప్పింది.
 
ఉదయం 10.40 నిమిషాలకు పార్కుకు వచ్చిన చిన్ని.. సాయంత్రం పార్కు మూసేంతవరకు సుబ్బారావుతోనే పార్కులోనే బాతాకానీ చెబుతూ కూర్చుంది. దీంతో ఆమెకు బాగా దగ్గరైపోయాడు సుబ్బారావు. ఆ తరువాత ఆమెకు ఫోన్ వచ్చింది. నా భర్త బయటకు రమ్మంటున్నాడంటూ వెళ్ళిపోయింది. సుబ్బారావు తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళాడు.
 
అయితే అప్పటి నుంచి అతనికి చిన్ని ఆలోచనలే. ఎలాగైనా మళ్ళీ ఆమెను కలవాలని తహతహలాడాడు. అయితే ఆమె ఫోన్ నెంబర్ తీసుకోకపోవడంతో బాధపడుతూ మరుసటి రోజు పార్కులో కూర్చున్నాడు. మళ్ళీ చిన్ని పార్కుకు వచ్చింది. ఇల్లు దొరికింది. మా ఆయన అనంతపురం వెళ్ళారు. సామాన్లు తీసుకురావడానికని చెప్పింది. ఇక సుబ్బారావు ఆమె నెంబర్ తీసుకున్నాడు.
 
ఆ తరువాత నుంచి ఆమెతో ఫోన్లో మాట్లాడటం ప్రారంభించాడు. అంతేకాకుండా తన కోర్కె తీర్చమని ఆమెను కోరాడు. ఇంకేముందు అనుకున్న విధంగా సుబ్బారావు తమ వలలో పడ్డాడనుకున్నారు రాజేష్, చిన్ని. సుబ్బారావు ఒక లాడ్జిని బుక్ చేసి చిన్నిని పిలిచాడు. ఆమె లోపలికి వెళ్ళిన ఐదు నిమిషాలకే రాజేష్, అతని స్నేహితులు ఇద్దరూ పోలీసు యూనిఫాంలో తలుపులు తట్టారు.
 
సుబ్బారావుకు భయం పట్టుకుంది. భయం.. భయంగానే తలుపులు తీశాడు. ఎవరు ఈమె.. నువ్వెవరు అంటూ అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మాది పరువు గల కుటుంబం. దయచేసి ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ.. నేను ప్రభుత్వ ఉద్యోగిని. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటూ చెబుతూ వచ్చాడు సుబ్బారావు. మొదట్లో సుబ్బారావు దగ్గర ఉన్న లక్ష రూపాయలు తీసుకున్న రాజేష్, ఆ తరువాత మరుసటి రోజు మరో నాలుగు లక్షల రూపాయలను బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాల్సిందిగా బెదిరించారు.
 
నాలుగు లక్షలు తీసిచ్చిన తరువాత కూడా సుబ్బారావును డబ్బు కోసం వేధించడం మొదలెట్టారు. దీంతో సుబ్బారావు తన కుమారుడికి అసలు విషయం చెప్పాడు. అతని కుమారుడి సహాయంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు నకిలీ పోలీసులుగా అసలు విషయం బయటపడింది. వారికి డబ్బులు ఇవ్వడానికి రమ్మని చెప్పమని సుబ్బారావు వున్న స్థలంలోనే పోలీసులు మాటు వేసి వారిని చాకచక్యంగా  పట్టుకున్నారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు