అప్పుడు మిలియన్ మార్చ్ చేస్తే బ్రహ్మరథం పట్టారు.. ఇప్పుడు తీవ్రవాదులమా? కోదండరాం ఫైర్

మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (19:12 IST)
తెలంగాణ సర్కారుకు సెగ మొదలైంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎన్ని చేసినా కొట్టిపారేసిన తెరాస సర్కారు కోదండరాం చేయతలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని చూసి జడుసుకుంటోంది. ఎందుకంటే కోదండరాం ఆధ్వర్యంలో నిరసనలకు స్పందన ఏ స్థాయిలో వుంటుందో తెలంగాణ ఉద్యమం సమయంలో వారు దగ్గరుండి చూశారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో రేప‌టి నిరుద్యోగ నిరసన ర్యాలీకి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాలేదు. 
 
దీనితో టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణ‌ స‌ర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ''ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారంద‌రి వెనుక నేరపూరిత చ‌రిత్ర ఉంద‌ని అంటే, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో చేసిన పోరాటాలు, మిలియ‌న్ మార్చ్ వంటివేనా ఆ నేరాలు. సిగ్గుచేటు. తెలంగాణ సాధనకు చేసిన పోరాటం నేరంలా అనిపిస్తోందా. ఆనాడు చేసిన ఉద్యమాలు న్యాయం కోసం చేసినవి కాదా అని ప్రశ్నించారు. అలాగయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నేరంలో భాగం వుంది కదా అని నిలదీశారు. తాము చేపట్టబోయే నిరుద్యోగ నిరసన ర్యాలీ నగరం నడిబొడ్డున చేయాలనుకున్నామనీ, ప్రజలకు తెలియాలని ఈ నిరసన చేయదలిచామని చెప్పారు. ఎక్కడో ఊరు బయట, సౌకర్యాలు లేని చోట ఎలా నిరసన చేస్తామంటూ ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి