తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించిన వారందరూ తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల విశ్వాసం పొందాల్సిందే అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం వక్కాణించారు. రాయింపుదారులను తిరిగి ఎన్నుకోవాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
పాలక పార్టీ, ప్రతిపక్షం రెండూ ప్రజాస్వామ్యంలో తమదైన చోటును కలిగి ఉంటాయి. ప్రతిపక్ష పార్టీకి చట్టబద్దంగా ఉన్న ఈ స్పేస్‌ను పాలకపక్షం తిరస్కరిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. అది ప్రతిపక్షాన్ని కాదు ప్రజాస్వామ్యాన్నే బలహీనం చేస్తుందన్నారు చిదంబరం.
ఎవరైనా వారి పార్టీని వదిలిపెడితే శాసన సభలో వారి సభ్యత్వం కోల్పోవలసి వస్తుందని ఫిరాయింపుల వ్యతిరేక చట్టం స్పష్టంగా చెబుతున్నా, తెలంగాణలో స్పీకర్ తన రాజ్యాంగ విధిని నెరవేర్చకపోవడం విషాదకరం. ఈ విషయాన్ని కోర్టు వద్దకు తీసుకెళితే న్యాయస్థానం కూడా తన రాజ్యాంగబద్ధ విధిని నెరవేర్చక పోవడం మరీ విషాదకరం అని చిదంబరం వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీలో అధికార తెరాసకు తగినంత మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు చెందిన ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను తెరాస లాగేసుకోవటం శోచనీయమన్నారు.