దేశవ్యాప్తంగా టమోటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవైపు పంట దిగుబడి తగ్గిపోవడంతో మరోవైపు భారీ వర్షాల కారణంగా టమోటాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో టమోటా లేకుండానే కూరలు వుండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఓ ఫోటోగ్రాఫర్ వినూత్నంగా ఆలోచన చేశాడు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం, కలెక్టరేట్ తరలింపుతో నానాటికీ పడిపోతున్న గిరాకీ కాస్తయినా పెరుగుతుందని ఆయన భావించాడు. అంతే.. పాస్‌పోర్టు ఫోటో తీయించుకుంటే టమోటాలు ఉచితం అంటు ఓ బోర్డు పెట్టేశాడు. ఇదెక్కడో ఓ సారి చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం బస్టాండ్ కాంప్లెక్స్‌లో పట్టణానికి చెందిన ఆనంద్ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. గతంలో స్థానికంగా కలెక్టరేట్ ఉన్నప్పుడు వ్యాపారం బాగానే నడిచేది. జిల్లా కలెక్టరేట్ పాల్వంచ మారడంతో గిరాకీ తగ్గింది. దీంతో తన వద్ద రూ.100 వెచ్చించి పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు (8) తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి పట్టణ వాసుల దృష్టిని ఆకట్టున్నారు.
అంతటితో సరిపెట్టుకోకుండా.. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడాన్ని పురవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 32 మంది వినియోగదారులు వచ్చారు. రూ.100 వెచ్చించి ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటాలు అందజేసినట్లు ఆనంద్ మీడియాకు తెలిపారు.