రైలుకు ఎదురుగా నిలబడి సెల్ఫీ.. పోయిన ప్రాణం ఫొటోగా మిగిలింది. తప్పు గుణపాఠం అంటే ఇదే

మంగళవారం, 30 మే 2017 (06:43 IST)
నిషిద్ధ ఫలాలు తినవద్దు అని దేవుడు హెచ్చరించినా వినకుండా వాటిని తినడం వల్లే సకల అవలక్షణాలతో కూడిన మానవ చరిత్ర మొదలైందని బైబిల్ చెబుతుంది. బైబిల్ వరకు ఎందుకు పలానా పని చేయవద్దు అని పెద్దలు తమ అనుభవ జ్ఞానంతో చెబితే అదే పని చేయాలన్ని ఆలోచన ప్రతి తరంలోనూ పిల్లలు చేస్తూనే ఉంటారు. ప్రాణంమీదికి తెచ్చుకునే పనుల జోలికి వెళ్లవద్దు అని ఎంత చెప్పినా ఆ సూక్తి వయసు పొగరు, నరాల పటుత్వం యుక్తవయసుకు వచ్చిన వారి చెవిన పడదు.

ఇప్పుడు పెద్దలు చెప్పే మాటలు వినకుండా పిల్లల్లో మరింత దూకుడు కలిగిస్తున్న కొత్త అంశం సెల్ఫీ.. కొన్ని పనులు ఎందుకు చేయకూడదు అనే ప్రశ్నకు తన ప్రాణం కోల్పోవడం ద్వారా సమాధానిమిచ్చాడు గోదావరి ఖని యువకుడు. వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి ఫొటో దిగాలన్న కోరిక అతడి ప్రాణాలనే బలిగొంది. ఆ విధంగా ఆ యువకుడి అనూహ్య మృతి మన సమాజానికే ఒక తప్పు గుణపాఠమై నిలిచింది. 
 
వివరాల్లోకి వెళితే,.. వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి ఫొటో దిగాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణం తీసింది. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన నస్పూరి సంపత్‌(32) ఓసీపీ–3 ప్రైవే టు ఓబీ కంపెనీలో డంపర్‌ ఆపరేటర్‌‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని అల్వాల్‌ వద్ద మిత్రుడి వివాహం ఉండడంతో స్నేహితులతో కలసి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అల్వాల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో మిత్రులతో కలిసి వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి ఫొటో దిగాలన్న కోరిక కలిగింది.
 
హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసే శ్రావణ్‌కుమార్‌తో ఫొటో దిగుతుండగా.. మరో స్నేహితుడు ఫొటో తీస్తున్నాడు. వెనుకనుంచి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు అతి సమీపంలోకి వచ్చినా గమనించకుండా ఏమరుపాటుగా ఉండడంతో రైలు ఢీకొని సంపత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్‌ చేయి నుజ్జునుజ్జు అయ్యింది.  విషాదకరమైన విషయం ఏమిటంటే సంపత్‌కు భార్య, కవల పిల్లలున్నారు. 
 
చిన్నప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎద్దులు గడ్డి మేస్తున్నప్పుడు వాటి వద్దకు పోయి వాటి కొమ్ములను పట్టుకుని వాటిని ముక్కులో పెట్టుకుని అబ్బ చూడండి మా ఎద్దు కొమ్ము నా ముక్కులో పెట్టుకున్నా ఏమీ చేయదు అంటూ సాహసాన్ని ప్రదర్శించిన ఎంతోమంది పిల్లల ముక్కులు తెగిపోయాయి.

పశువు జోలికి వెళ్లకండిరా. దాని బాధలు దానికుంటాయి. దగ్గరికి పోయి నిమిరితే తమకంగా ఉంటుందనుకోవద్దు. దాని అవసరాలకోసం అది అటూ ఇటూ తల వూపితే కొమ్ములు విసిరితే ప్రమాదం అంటూ ఎన్నోసార్లు పెద్దలు హెచ్చరించేవారు. వాటిని విన్న పిల్లలు ప్రమాదాలకు దూరంగా ఉండేవారు. మా ఎద్దు కొమ్ములను ముక్కులో పెట్టుకున్నా ఏమీ అనదు అంటూ మిడిమాలంగా వ్యవహరించే పిల్లల ముక్కులు చాలా సందర్భాల్లో చీరిపోయేవి. 
 
చూస్తుంటే మేమేమి చేసినా మాకేమీ కాదు అనే అనవసర తెంపరితనం తరాలుగా పిల్లల్ని, యువతను వెంటాడుతూనే ఉన్నట్లుంది.
 

వెబ్దునియా పై చదవండి