ఈ నెల 30వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శల్లో పదును పెంచారు. దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికకు దారితీసిందన్నారు. వీళ్లది దేవుడి మాన్యాలు ఆక్రమించుకున్న పంచాయితీ, దళితుల భూములు లాక్కున్న పంచాయితీ అంటూ నిప్పులు కురిపించారు.
కేసీఆర్ తాను ప్రతి మహిళ పెద్దకొడుకునని చెప్పుకుంటున్నాడని, కేసీఆర్ పెద్దకొడుకు కాదని దొంగ కొడుకు అని మండిపడ్డారు. మన కన్న కొడుకులకు నౌకరీ ఇస్తే ఇవాళ ఇలా అడుక్కుతినే పరిస్థితి వచ్చేదా? అని ఆగ్రహం వెలిబుచ్చారు.