హుజురాబాద్‌లో జానారెడ్డికిపట్టిన గతే ఈటలకు కూడా పడుతుంది: మంత్రి తలసాని

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (08:39 IST)
హుజురాబాద్ ఉప ఎన్నికను తెలంగాణా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా, తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రికోణ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. 
 
ఇప్పటికే తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ తరపున కొండా సురేఖ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక బీజేపీ తరపున ఇటీవల తెరాస రాజీనామా చేసి ఆ పార్టీలో చేరిన ఈటల రాజేందర్ బరిలోకి దిగినున్నారు. దీంతో నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. 
 
తాజాగా ఈట‌ల రాజేంద‌ర్‌పై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఈట‌ల‌పై త‌ల‌సాని ఫైర్ అయ్యారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అనడం ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనమన్నారు. 
 
ఈటల హుజురాబాద్‌లో బీసీ అని.. శామీర్‌పేటలో ఓసి అని ఎద్దేవా చేశారు. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు.. నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే అన్న విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు అని త‌ల‌సాని గుర్తు చేశారు. ఉద్య‌మ‌కారుల‌కు టీఆర్ఎస్ పార్టీ  అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు. 
 
గ‌తంలో విద్యార్థి నాయ‌కులైన బాల్క సుమ‌న్, గ్యాద‌రి కిశోర్ లాంటి వారికి అవ‌కాశం క‌ల్పించి, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామ‌ని తెలిపారు. గెల్లు శ్రీనివాస్‌కు కూడా అదే విధంగా కేసీఆర్ ప్రాధాన్య‌త ఇచ్చార‌ని చెప్పారు. ముఖ్యంగా జానారెడ్డికి పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుందన్నారు. 
 
గతంలో ఆరు సార్లు కేసీఆర్ దయాదాక్షిణ్యాలపై ఈటల విజయం సాధించారని చెప్పారు. హుజూరాబాద్ ప్ర‌జ‌లు ఈట‌ల రాజేంద‌ర్‌కు త‌ప్ప‌కుండా గుణ‌పాఠం చెబుతారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు