తెలంగాణ బడ్జెట్ 2018-19 మార్చి 15న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 27 వరకూ సాగుతాయనీ, ఐతే మార్చి 16, 18, 26 తేదీల్లో చర్చ వుండదు. కాగా ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు వేడి పుట్టించాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకు విరగ్గొట్టి స్పీకరుపైకి విసరడంతో దుమారం చెలరేగింది. సభ్యులపై చర్యలు తీసుకునేవరకూ వెళ్లింది వ్యవహారం.
మరోవైపు కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారంటూ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. నియంత పాలన ఎలా ఉందో దేశానికి తెలియజేయడానికె ఈ దీక్ష చేస్తున్నాం. నా ప్రాణం పోయినా సరే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యం అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసాను. కేసీఆర్‌లా దొంగ దీక్ష చేయం. హరీష్ కర్ణాటక ఎన్నికలతో ఉప ఎన్నికలు వస్తాయి అన్నారట. ఉప ఎన్నికలు వస్తే సంపత్‌ను 50 వేల ఓట్లతో గెలిపించుకుంటాం అని ధీమా వ్యక్తం చేసారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసులను అసెంబ్లీలో పెట్టారు. నాకు సంపత్, రామ్మోహన్ రెడ్డికి సభలో గాయాలు అయ్యాయి. కట్టు కథలతో స్వామి గౌడ్‌కి గాయాలు అయినవి అంటున్నారు. పొద్దున ఒక కన్నుకు సాయంత్రం మరో కన్నుకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సభలో నిరసన తెలిపిన విజువల్స్ చూయిస్తున్నారు. మరి స్వామి గౌడ్‌కి అయిన గాయాలు ఎందుకు చూపించలేదు అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, రాజకీయ హత్యలపై నిలదీస్తామని సస్పెండ్ చేశారు. మమ్మల్ని బహిష్కరించారన్నారు.