తెలంగాణాలో కరోనా విజృంభణ : ఆస్పత్రుల్లో వైద్యుల కొరత???

సోమవారం, 15 జూన్ 2020 (09:50 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 237 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఏకంగా 195 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఈ కేసులతో కలుపుకుంటే తెలంగాణాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,974కు చేరుకున్నాయి. 2,377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,412 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో ముగ్గురు చనిపోవడంతో, రాష్ట్రంలో మరణాల సంఖ్య 185కి పెరిగింది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్త కేసులేమీ వెల్లడి కాలేదు.
 
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న వేళ, రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స 9 జిల్లా ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నా, అక్కడ ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో లేరనే విమర్శలు లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 శాతం వరకూ డాక్టర్ల కొరత ఉందని వైద్యాధికార వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆదిలాబాద్‌లోని రిమ్స్, వరంగల్‌లోని ఎంజీఎంలతో పాటు కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, సిద్ధిపేట, ఖమ్మం, సూర్యాపేట జిల్లా ఆసుపత్రులు కోవిడ్ 19 ఆస్పత్రులుగా మార్చారు. ఇందులో నిజామాబాద్ ఆసుపత్రిలో 200 బెడ్లను కరోనా రోగులకు కేటాయించారు. 
 
అయితే, ఇక్కడ 304 మంది వైద్యులు పనిచేయాల్సి వుండగా, ప్రస్తుతం కేవలం 104 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. రిమ్స్‌లో కరోనా రోగుల కోసం 100 బెడ్లు ఉండగా, ప్రస్తుతం 9 మందికే చికిత్స జరుగుతోంది. ఇక్కడ కేవలం ఐదుగురు సీనియర్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితి ఏంటన్నది వైద్య వర్గాలకే అంతుచిక్కడం లేదు. అలాగే, మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనివుందనే విమర్శలు లేకపోలేదు. 
 
అలాగే, ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే, 100 బెడ్లు కరోనా రోగుల కోసం ఉండగా, 50 శాతం వైద్యుల కొరత ఉంది. వరంగల్ ఎంజీఎంలో 200 బెడ్లకుగాను ప్రస్తుతం 10 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 1,420 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 870 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నల్గొండ జీజీహెచ్‌లో 25 సాధారణ, 10 ఐసీయూ బెడ్లను వైద్యాధికారులు సిద్ధం చేశారు.
 
మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో 111 మంది పనిచేయాల్సి వుండగా, ప్రస్తుతం 26 మంది మాత్రమే ఉన్నారు. కాగా, ఈ ఆసుపత్రుల్లో లెవల్ 1, లెవల్ 2 కరోనా పేషంట్లకు మాత్రమే చికిత్స చేసే వీలుంది. పరిస్థితి విషమించి, వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైతే, ఇక్కడి వారు చేతులెత్తేసి, హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు