రోకలి బండతో భర్త తలపై బాదిన భార్య.. స్పాట్‌లో ప్రాణంపోయింది...

సోమవారం, 4 జనవరి 2021 (08:40 IST)
నిత్యం మద్యం సేవించి వచ్చి చిత్ర హింసలు పెడుతున్నాడని భర్తను ఓ భార్య కొట్టి చంపేసింది. మద్యంమత్తులో ఉన్న భర్త తలపై రోకలి బండతో బలంగా ఒక్క దెబ్బ కొట్టింది. అంతే... ఆ వ్యక్తి అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... వరంగల్‌ జిల్లాకు చెందిన గోవింద్‌ శ్యామ్‌ అలియాస్‌ శ్యాంసుందర్‌ (38), సరోజ (35) మూడేళ్ల క్రితం నాగారం మున్సిపల్‌ పరిధికి వలస వచ్చారు. వాచ్‌మన్‌ డ్యూటీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్యాంసుందర్‌ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో సరోజను తిడుతూ, కొడుతూ వేధించేవాడు. 
 
రోజూలాగే శనివారం రాత్రి శ్యాంసుందర్‌ మద్యం తాగి సరోజను కొట్టాడు. భరించలేని సరోజ పక్కనే ఉన్న రోకలిబండతో అతని తలపై గట్టిగా కొట్టింది. శ్యాంసుందర్‌ తలకు తీవ్ర గాయమై స్పృహతప్పి కింద పడిపోయాడు. మందు ఎక్కువై కింద పడిపోయాడని భావించింది సరోజ. ఉదయం నిద్ర లేచిన ఆమె శ్యాంసుందర్‌ను లేపగా అతను చనిపోయి ఉన్నాడు. 
 
దీంతో సరోజ బాపూజీ కాలనీ వాసులకు సమాచారం అందించింది. కాలనీ అధ్యక్షుడు సీఐ నరేందర్‌ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్యాంసుందర్‌, సరోజ దంపతులకు ఒక కూతురు ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు