గ్యాంగ్ స్టర్ నయీమ్ మాఫియాతో తనకు లింకులు ఉన్నాయంటూ పత్రికల్లో వార్తలు రావడంపై మాజీమంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీమ్ తనకు వందలసార్లు ఫోన్ చేసాడంటూ ప్రచారం అవుతున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలనీ, తనకు నయీమ్ ఎవడో కూడా తెలియదని చెప్పారు. ఇలాంటి లీకులు ఎవరు ఇస్తున్నారో వారు తనకు సమాధానం చెప్పాలన్నారు.
తన ఇంటికి ల్యాండ్ లైనే లేదనీ, అలాంటప్పుడు తనకు ఫోన్ కాల్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మాధవరెడ్డికి ఉన్న ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నయీమ్ వ్యవహారం అంతా సీఎం కేసీఆర్ కు తెలుసునని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. నయీమ్‌తో తాము సంభాషించినట్లు నిరూపించాలనీ, ఇందుకోసం జ్యుడిషియల్ విచారణకు తను సిద్ధమని చెప్పారు. ఆధారాలుంటే తన కాల్ డేటాను బయటపెట్టాలని సవాల్ విసిరారు. తెదేపా కోసం అతడినేమైనా ఉపయోగించుకున్నారేమోనని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.