వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మేడిపల్లి వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, మంగళవారం నాటి దీక్షకు ఆమెకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత ఆమె మేడిపల్లి పీఎస్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. విషయం తెలియడంతో మేడిపల్లి పీఎస్‌కు వైఎస్సార్ టీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వందల మంది నిరుద్యోగులను పొట్టనపెట్టుకున్న హంతకుడు కేసీఆర్ అని... షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే.. తమ దీక్షకు అనుమతి ఇవ్వలేదని ఆమె ధ్వజమెత్తారు.