నేను క్రిటిక్స్ మీద చేసినా కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి.. ఆ కామెంట్ చేయడానికి కారణం ఏమంటే, కొన్నాళ్లుగా చూస్తున్న వాటి మీద స్పందించాను. ఇక్కడ అందరం ఇండస్ట్రీ మీద బతుకుతున్నాం. చాలా బాధ్యతగా వుండాలి. బాగున్న సినిమాపై అలా క్రిటిసిజం చేయడం కరెక్ట్ కాదు. మీకు నచ్చలేదంటే సజెషన్స్ ఇవ్వచ్చు. మీ దగ్గర కథలంటే చెప్పొచ్చు. కానీ బాగున్న దాని మీద విమర్శ చేయడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదనిపించే ఆరోజు అలా మాట్లాడాను అని విజయశాంతి అన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ S/O వైజయంతి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా విజయశాంతి పలు విశేషాల్ని పంచుకున్నారు.
అఖండ2 సినిమాలో మీరు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ?
-నాకు తెలియదండి. మీరు చెప్తుంటే తెలుస్తుంది.
అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
జీవితంలో మంచి సినిమా చేశామనే తృప్తి వుంది. కాప్, మదర్ గా చాలా విరామం తర్వాత ఒక పవర్ ఫుల్ పాత్ర చేయడం జరిగింది. ప్రజలు రాములమ్మని విజయశాంతిని ఎలాంటి పాత్రలో చూడాలని అనుకున్నారో ఈ సినిమాతో అది ఫుల్ ఫిల్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ అనేది ఒకరకంగా నాకు ఛాలెంజ్. కాని నేను చేశాను. యాక్షన్ పెర్ఫార్మెన్స్ ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అందరూ వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అందుకే సినిమాకి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది.
-ఈ సినిమాతో తల్లితండ్రులు కొడుకుల బంధాన్ని వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని బలంగా చూపిండం జరిగింది. ఈ కథని దర్శకుడు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. మంచి సినిమా చేశామనే తృప్తి వందశాతం వుంది. చాలా మహిళలు ఫోన్ చేసి సినిమా అద్భుతంగా వుంది, మదర్ అండ్ సన్ ఎమోషన్ కట్టిపడేసిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. పరీక్షల వలన కొందరు చూడలేకపోయారని నాకున్న సమాచారం. రేపటి నుంచి అందరం వెళ్తామని చెబుతున్నారు. రేపటి నుంచి ప్రేక్షకాదరణ ఇంకా అద్భుతంగా వుండబోతోంది.
అఫ్ స్క్రీన్ లో కూడా కళ్యాణ్ రామ్, మీకు మధ్య మదర్ అండ్ సన్ ఎమోషన్ కనిపించింది?
-కళ్యాణ్ బాబు చాలా మంచోడు. సినిమాలో మాకు మంచి బాండ్ ఏర్పడింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. తనకి నాపై చాలా ఆప్యాయత. గత జన్మలో తను నాకు బిడ్డ ఏమో నాకు తెలీదు. ఈ సినిమాకి అన్నీ అద్భుతంగా కుదిరాయి.
చాలామంది రీఎంట్రీ ఇస్తున్నారు? కానీ మీకోసమే రాసుకుంటున్న క్యారెక్టర్స్ రావడం ఎలా అనిపిస్తుంది?
-బిగినింగ్ నుంచి నా ట్రాకే సపరేటు. ప్రతిఘటన, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, మొండి మొగుడు పెంకి పెళ్ళాం.. ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశాను. ఇన్ని రకాల పాత్రలు చేయడం నాకు కుదిరింది. ఇది గాడ్ గిఫ్ట్ అని భావిస్తాను.
- నా కెరీర్ బిగినింగ్ నుంచి ఒక డెడికేషన్ క్రమశిక్షణతో వర్క్ చేయడం అలవర్చుకున్నాను. నిరంతరం ఏదో కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నించాను. ప్రజలు ఆశీర్వదించి సింహాసనం పై కూర్చోబెట్టారు. ప్రతిఘటన తర్వాత లేడీస్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ప్రజల నుంచే వచ్చింది. అలాగే లేడి జాకీ చాన్ పిలిచారు. ఇదంతా ప్రజల ప్రేమ.
ఈ సినిమాలో ఇంట్రడక్షన్ బురద యాక్షన్ సీక్వెన్స్ కి చాలా మంచి అప్లోజ్ వచ్చింది.. అది చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-అది చాలా చలికాలంలో తీసిన సీక్వెన్స్. చలికి వణికిపోయాను. ఆ సీక్వెన్స్ ని నైట్ లో తీశారు. చాలా చాలెంజింగ్ గా అనిపించింది. ప్రజల నుంచి ఆ సీక్వెన్స్ కి మంచి అప్లోజ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఏడాది పాటు డైట్ పాటించాను. అలాగే పాత్ర కోసం నిరంతరం వర్క్ ఔట్స్ చేశాను.
హీరోయిన్ గా ఇటు యాక్షన్ హీరోయిన్ గా.. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసేవారు?
-ఏమో నాకు తెలియదండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా హీరోలు అందరితో ఫుల్ గ్లామరస్ రూల్స్ చేశాను. ఇటు చంద్రమోహన్ లాంటి హీరోలతో పని చేశాను. దాదాపు 60 మంది హీరోలతో కలిసి పని చేశాను. చాలా ఎక్స్పరిమెంట్లు చేశాను. నా ప్రతి సినిమాకి వేరియేషన్ ఉంటుంది. ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. ఇదంతా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు నాకు అలా రాసిచ్చాడు.
గ్రామంలో బండ్లు కట్టుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ?
- ఇది చాలా గొప్ప వరంగా భావిస్తున్నాను. బండ్లు కట్టుకుని వచ్చేవారు. అప్పుడు ప్రింట్స్ ఉండేవి. అక్కడే స్నానాలు చేసి వంట చేసుకుని కూడా తినేవారు. అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జనరేషన్ యూత్ కూడా నన్ను రాములమ్మ అని పిలుస్తారు. మీటింగ్లకు వచ్చి రాములమ్మ అక్క అని పిలిస్తే ఆశ్చర్యపోయేదాన్ని. మీ నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.