సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా టగ్ ఆఫ్ వార్ సాగుతుంది. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పు పడుతూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని జనసైనికులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. "ఎంజీఆర్‌పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో! పై నుంచి ఆదేశాలు అందాయా? అంటూ పవన్‌కు గుచ్చుకునేలా చురక అంటించారు. అంతకుముందు మరో ట్వీట్లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
స్వరాష్ట్రమైన కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన జోకర్.. ఇపుడు గెలుపు వీరులు కూర్చొనే వేదికపై కూర్చొని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తమిళ నిర్మాత వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి 'స' కారం గురించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనికి తమిళ నిర్మాత వినోద్ కుమార్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
తాజాగా ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో ఓ వేదికపై కూర్చున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫొటోలో సీఎం స్టాలిన్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివలు కూడా ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి విత్ డిప్యూటీ సీఎం అని పెట్టారు. అయితే ఈ ఫోటోకి ప్రకాష్ రాజ్‌కి ఊహించని ట్వీట్ ఎదురైంది.
'ఎనిమి', 'మార్క్ ఆంటోని' సినిమాలు నిర్మించిన నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు. నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయావు. నీకు వాళ్లకు అదే తేడా. పైగా, నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్ అయి కోటి రూపాయల నష్టం వాటిల్లింది. చెప్పకుండా కారవాన్ నుంచి పారిపోయావు. కాల్ చేస్తానని చెప్పావు. ఇప్పటివరకు చేయలేదు అంటూనే జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.