తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసి ఏపీ సీఎం జగన్ నేర్చుకోవాలి: నాదెండ్ల మనోహర్

గురువారం, 25 నవంబరు 2021 (18:54 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారని విమర్సించారు జనసేన పార్టీ పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మనోహర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజానికి ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా జగన్ రెడ్డి చేయలేదన్నారు.

 
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని.. 6,054 కోట్ల రూపాయల కేంద్ర సహాయం ప్రభుత్వం అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు వరద సహాయం కోసం ఇవ్వాలని 2 కోట్లు, కడప జిల్లా కలెక్టర్ రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రాన్ని మాత్రం అన్ని వేల కోట్ల ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

 
5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. 76 మంది వరద నీటిలో గల్లంతయ్యారన్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికైనా సిఎం పర్యటించాలన్నారు. సిఎం హెలికాప్టర్ ఎక్కి కాకి లెక్కలు చెబుతున్నారని.. కడప జిల్లా మందపల్లి గ్రామంలో రైతులు నిరాశ్రయులయ్యారన్నారు.

 
సొంత జిల్లాలో నిరాశ్రయులకు ఆదుకోవడానికి కూడా సిఎంకు సమయం లేదా అని ప్రశ్నించారు. వైద్య శిబిరాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. పంటలు పండే పొలాల్లో వరద నీరు కనిపిస్తోందన్నారు.

 
రైతులకు ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారని ప్రశ్నించిన మనోహర్.. అసెంబ్లీ సమావేశాలను ఎందుకు పొడిగించారని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలను రాజకీయ కోణంలో చూస్తున్నారన్నారు. సినిమా టిక్కెట్ల అంశంపై అసెంబ్లీలో సాయంత్రం వరకు చర్చిస్తారా అంటూ మండిపడ్డారు. ఎన్ఆర్ఐ, ఎన్జీఓలు, జనసైనికులు వరద బాధితులను ఆదుకున్నారని.. తమిళనాడు సిఎంను చూసి జగన్ చాలా నేర్చుకోవాలన్నారు. 68 యేళ్ళ వయస్సులో స్టాలిన్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తే 45 యేళ్ళ జగన్ రెడ్డి ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు