ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కాశ్మీరీలకు ఈ పరిస్థితికి రావడానికి కాంగ్రెస్ చేసిన తప్పిదాలే కారణమంటూ మండిపడ్డారు. కాశ్మీర్ ప్రజల విముక్తి కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని ఆయన సభా ముఖంగా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని, దానికి ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు.
కాశ్మీర్ భారత సమాఖ్యలో భాగమేనని, ఆ విషయం రాజ్యాంగంలో కూడా ఉందని గుర్తుచేశారు. కాశ్మీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న పార్లమెంట్‌కు పూర్తిస్థాయి అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో జమ్మూకాశ్మీర్‌కు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుల ఆమోదానికి సభలో సహకరించాలని కోరారు.
అంతకుముందు.. జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై జరిగిన చర్చలో భాగంగా, కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నియమాలను పాటించలేదన్నారు.
కాశ్మీర్ మొదటి నుంచీ దేశ అంతర్గత వ్యవహారమని, కానీ ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. కాశ్మీర్ అంతర్గత వ్యవహారమా? లేక ద్వైపాక్షిక వ్యవహారమా? అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేయగా, అమిత్ షా పై విధంగా స్పందించారు.