కరోనా వైరస్ మహమ్మారిపై న్యూజిలాండ్‌ అద్భుత విజయం.. ఎలా?

సోమవారం, 10 ఆగస్టు 2020 (08:45 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై న్యూజిలాండ్ దేశం అద్భుత విజయం సాధించింది. అంటే ఈ వైరస్‌ను పూర్తిగా అరికట్టి పైచేయి సాధించింది. ఫలితంగా గత వంద రోజుల్లో ఒక్కటంటే ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా న్యూజిలాండ్ దేశంలో నమోదు కాలేదు. 
 
నిజానికి తమ దేశాలు కరోనా ఫ్రీ దేశాలు అని ఆస్ట్రేలియా, వియత్నాం వంటి పలు దేశాలు గంభీరంగా ప్రకటించుకున్నాయి. కానీ, ఇలాంటి దేశాల్లో ఆ తర్వాత కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, న్యూజిలాండ్‌ మాత్రం అలా కాదు. చడీచప్పుడు లేకుండా కరోనా మహమ్మారిని తరిమికొట్టింది. ఫలితంగానే కరోనా ఫ్రీ దేశంగా మారిపోయింది. 
 
వైరస్‌ కేసులు నియంత్రణలోకి వచ్చి, కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించిన 100 రోజుల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఆ దేశంలో నమోదుకాలేదు. న్యూజిలాండ్‌లో మే 1 తర్వాత ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని, దేశంలో కరోనా సమూహ వ్యాప్తి జాడలేదని ఆదివారం ఆ దేశ అధికారులు ప్రకటించారు. 
 
50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఫిబ్రవరి 26న తొలికేసు నమోదైంది. అయితే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల కేవలం 65 రోజుల్లోనే వైరస్‌ కట్టడి జరిగింది. పౌరుల కదలికలపై బ్లూటూత్‌ వంటి టెక్నాలజీ సాయంతో నిఘాను పెట్టడంవల్లే మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలిగామని అధికారులు తెలిపారు.
 
కాగా, న్యూజిలాండ్‌లో మొత్తం 1569 కరోనా నిర్ధారణ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 మరణాలు సంభవించాయి. ఇందులో 23 యాక్టివ్ కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించినవి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు