చంద్రబాబుతో దోస్తీ చేస్తారా? అబ్బే కాంగ్రెస్‌లో వుండను.. చిరంజీవి

శనివారం, 10 నవంబరు 2018 (10:59 IST)
ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ దోస్తీ చేయడంపై మెగాస్టార్ చిరంజీవి అలక పాన్పు ఎక్కారని టాక్ వస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరంగా వున్న చిరంజీవి.. ఆ పార్టీ నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ దోస్తీ చేయడం మెగాస్టార్‌కు నచ్చలేదట.


అందుకే ఆ పార్టీ నుంచి ఇదే అదనుగా రాం రాం చెప్పేయాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తుపై చిరంజీవి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్నేహాన్ని ఆయన అనైతికమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
 
చిరంజీవి తన కాంగ్రెసు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదట. అయితే, కాంగ్రెసుకు తాను దూరమైనట్లు కనీసం సంకేతాలు కూడా ఇవ్వలేదు. రాజకీయాల గురించి ఆయన మాట్లాడడం లేదు. ప్రస్తుతం సైరా సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. 
 
మరోవైపు తమ్ముడు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. ప్రజారాజ్యం పార్టీకి గౌరవ అధ్యక్షులుగా చిరంజీవి నియమితులైనా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్ వస్తోంది. ఇక చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న సి. రామచంద్రయ్య కూడా కాంగ్రెసులో చేరారు. 
 
కానీ తెలుగుదేశంతో కాంగ్రెస్ స్నేహాన్ని నిరసిస్తూ రామచంద్రయ్య పార్టీకి రాజీనామా చేశారు. రామచంద్రయ్య చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. దాంతో చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇటీవలే వట్టి వసంత కుమార్ కూడా కాంగ్రెసుకు రాజీనామా చేశారు. వట్టి వసంత కుమార్, రామచంద్రయ్య ఇద్దరు కూడా జనసేనలో చేరే అవకాశాలు లేకపోలేదని సమాచారం. వారితో పాటు చిరంజీవి కూడా తమ్ముడితో చేతులు కలిపే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు