రోటీలకు సూటయ్యే క్యాప్సికమ్ టమోటో పచ్చడి

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:44 IST)
రోటీలు, చపాతీలకు ఆలూ కర్రీ, చికెన్, మటన్ గ్రేవీలు తయారు చేసి బోర్ కొట్టేసిందా..? అయితే సింపుల్‌గా క్యాప్సికమ్ టమోటా పచ్చడి ట్రై చేయండి. క్యాప్సికమ్‌లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా వుంటాయి. శరీరబరువును అదుపులో ఉంచడానికి క్యాప్సికమ్‌ తోడ్పడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను క్యాప్సికమ్ దూరం చేస్తుంది.

డయాబెటిస్‌కు చెక్ పెడుతుంది. అలాగే టమోటాను రోజు ఆహారంలో చేర్చుకుంటే, బరువును నియంత్రించుకోవచ్చు. టమోటాలో క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. తద్వారా శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఈ రెండింటి కాంబోలో క్యాప్సికమ్ టమోటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
క్యాప్సికమ్ ముక్కలు - రెండు కప్పులు 
టమోటా ముక్కలు - రెండు కప్పులు
పచ్చిమిర్చి తరగు - పావు కప్పు 
పల్లీలు - రెండు స్పూన్లు 
సెనగపప్పు - రెండు స్పూన్లు 
జీలకర్ర - ఒక స్పూన్ 
తాలింపుకు - నూనె, పోపు 
నూనె, ఉప్పు - తగినంత 
మినపప్పు - ఒక స్పూన్ 
 
తయారీ విధానం :
స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేసి పల్లీలు వేసి వేగాక తీసి పక్కనబెట్టుకోవాలి. అందులో మినపప్పు, సెనగపప్పు వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమోటా ముక్కలను వేసి బాగా వేపాలి. వేగాక తగినంత ఉప్పు చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఆరనివ్వాలి.

తర్వాత మిక్సీలో పల్లీలు, సెనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసి పచ్చడికి తగినట్టు రుబ్బుకోవాలి. ఆపై క్యాప్సికమ్, టమోటా, కొత్తిమీర, జీలకర్ర వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని.. బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేగాక తాలింపు దినుసులతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించి పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి రోటీల్లోకి భలేగుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు