భారతదేశంలో ఆర్థికమాంద్యం కాస్త తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతానికి చేరుకోవచ్చని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తెలిపింది.
ప్రస్తుతం దేశంలో అన్ని పరిశ్రమలలో ఉత్పత్తులు వేగవంతంగా పుంజుకుంటున్నాయని, ఆర్థిక సంకేతాలు కూడా సానుకూల వాతావరణంలో ప్రయాణిస్తున్నాయని ఆ సంస్థ డైరెక్టర్ మనోజ్ వోహ్రా తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి రేటు సరాసరి 6.5 శాతానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఇదే వృద్ధి రేటు 5.8 శాతానికి చేరుకుంటుందని భావించామని, కాని దేశంలో ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పట్టి ఉత్పత్తుల నిర్మాణం ఊపందుకుందని ఆయన తెలిపారు.
గడచిన కొద్ది నెలలుగా పారిశ్రామిక ఉత్పత్తులు, ఇతర ఆర్థిక రంగాలలో సానుకూల సంకేతాలు కనపడుతున్నాయని ఆయన అన్నారు. దీనినిబట్టి ఆర్థిక మాంద్యం నుంచి భారతదేశం బయటపడినట్లేనని ఆయన పేర్కొన్నారు.