ప్రభుత్వ చమురు కంపెనీలపై పిడుగుపాటు.. బరిలో ప్రైవేట్ చమురు కంపెనీలు
శనివారం, 24 జూన్ 2017 (02:56 IST)
జాతీయ ఆదాయానికి సిరులు కుమ్మరిస్తున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా ఇకనుంచి ప్రైవేట్ పరమవుతున్నాయి. గత 70 ఏళ్లకు పైగా చమురు రిటైల్ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం వహించి తిరుగులేని ఆర్థిక శక్తిగా మారిన ప్రభుత్ప చమురు కంపెనీల హవా ఇకనుంచి స్వదేశీ, విదేశీ చమురు సంస్థల దాడితో వెలవెలలాడిపోనుంది. తల్చుకుంటేనే భయం కలిగిస్తున్న ఈ విపరిణామంతో వచ్చే మూడు నాలుగేళ్లలో ప్రభుత్వ చమురు కంపెనీలు మసక బారనున్నాయి. గతనెల వరకూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో దాదాపు 95 శాతం వాటా వీటి చేతిలోనే ఉండగా... మెల్లగా అది తగ్గుతూ వస్తోంది. ప్రయివేటు కంపెనీలైన షెల్, ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ మెల్లగా వాటా పెంచుకోవటమే దీనిక్కారణం.
ఎందుకంటే ప్రపంచ చమురు దిగ్గజాలైన రాస్‌నెఫ్ట్ (రష్యా), బ్రిటిష్ పెట్రోలియం (యూకే), ఆరామ్ కో (సౌదీ), రాయల్ డచ్ షెల్ (నెదర్లాండ్స్)... భారత రిటైల్ మార్కెట్‌పై కన్నేశాయి. గతంలోనే భారత్‌లోకి అరంగేట్రం చేసిన షెల్... భారీగా పెట్టుబడులు పెంచబోతుండగా... మిగిలిన కంపెనీలు ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. శుక్రవారంనాడు రాస్‌నెఫ్ట్ డీల్‌కు రుణదాతలు ఓకే చెప్పిన నేపథ్యంలో... ఇవన్నీ బంకులు ఏర్పాటు చేసే పరిణామం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
దేశంలో 2014కు ముందు వరకూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండేది. వినియోగదారులపై పడే భారాన్ని సబ్సిడీల రూపంలో ప్రభుత్వం భరించేది. కాకపోతే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోవటం కేంద్ర ప్రభుత్వానికి కలిసొచ్చింది. దీంతో మెల్లగా తమ నియంత్రణను సడలించి, మార్కెట్ ధరలకు అనుగుణంగా నిర్ణయించే అధికారాన్ని కంపెనీలకు కట్టబెట్టింది.
అప్పటికే ఈ రంగంలోకి వచ్చి... పోటీని తట్టుకోలేక చాలా బంకుల్ని మూసేసిన రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ వంటి సంస్థలకు ఈ పరిణామం కలిసొచ్చింది. సబ్సిడీల శకం ముగియటంతో 2014 నుంచీ ఇవి తమ బంకుల్ని తిరిగి తెరిపించటం మొదలెట్టాయి. 2021 నాటికి ఈ రెండు సంస్థలూ దాదాపు 8000 బంకుల వరకూ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల క్రిసిల్ నివేదిక ఒకటి వెల్లడించింది.
‘‘దీంతో ప్రస్తుతం 4–5 శాతంగా ఉన్న వీటి వాటా 2021 నాటికి 15 శాతానికి చేరుతుంది. అయితే ప్రస్తుతం 53 వేల బంకులున్న ప్రభుత్వ రంగ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ కూడా అప్పటికి మరో 9వేల బంకుల్ని ఏర్పాటు చేస్తాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌కు పెరగనున్న డిమాండ్ దృష్ట్యా ఇవన్నీ విస్తరణ ప్రణాళికలు వేస్తున్నాయి’’ అని క్రిసిల్ వివరించింది. ప్రస్తుతం ఎస్సార్ ఆయిల్‌కు దేశవ్యాప్తంగా 2,700 బంకుల వరకూ ఉండగా... ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 1200 వరకూ ఉన్నాయి. వీటిలో చాలావరకూ మూతపడగా... ఇటీవలే ఒక్కొక్కటిగా వేగంగా తెరుచుకుంటున్నాయి.