తెలుగు రాష్ట్రాల్లో గత వారంరోజులపైగా నగదు కొరత మళ్లీ చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్‌లో 500 పైగా ఎటీఎంలకు గానూ కేవలం 23 ఏటీఎంలలోనే అప్పుడప్పుడూ డబ్బు పెట్టడం.అది నిమిషాల్లో ఖాళీ అవటం జనాలను బెంబేలెత్తిస్తోంది. ఇక ఏపీలో పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. బ్యాంకుల నిర్వహణ సామర్త్యం మీదే పూర్తిగా నమ్మకం పోతున్న రోజులివి. ప్రభుత్వం ఆదేశాలు, ఒత్తిడితో బ్యాంకులు మేల్కొన్నట్లుంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుకు అనుబంధంగా ఉండే ఏటీఎంలలో ధనలక్ష్మి గలగలలాడుతుందని బ్యాంకులు హామీ ఇచ్చేస్తున్నాయి.
ఏ సమయంలో డబ్బు అవసరమైనా ఆన్సైట్ ఏటీఎంలనే ఎంచుకోండి. బ్యాంకు చెంతనే ఉన్న ఏటీఎంల్లో నగదు లేదన్న చింత ఇక ఉండదు! బ్యాంకు సిబ్బందిని తిట్టుకుంటూ తిరగాల్సిన పని అసలు రాదు!!ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత.. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏటీఎంల్లో ధనలక్ష్మి నిండుగా ఉంటుంది. అర్ధరాత్రయినా, అమావాస్యయినా.. ఏనీటైం మనీ తీసుకోవచ్చు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలన్నింటిలోనూ వాటి సామర్థ్యానికి తగినట్టుగా డబ్బు ఉంచాలని బ్యాంకులకు ఆదేశాలు అందాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతోంది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆన్సైట్లో ఉన్న ఏటీఎంల్లో నగదును నింపే బాధ్యతలను బ్యాంకు అధికారులే నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే బ్యాంకుల చెంత, బ్యాంకు ప్రాంగణంలో ఉన్న ఏటీఎంల నిర్వహణ బాధ్యతంతా వారిదే. బ్యాంక్ మేనేజర్‌తోపాటు, అకౌంటెంట్, క్యాషియర్.. ఈ ముగ్గురూ ఆ ఏటీఎంల్లో నగదు కొరత లేకుండా చూడాల్సి వుంటుంది. రద్దయిన రూ.500, రూ.1000నోట్లు చలామణిలో ఉన్నప్పుడు ఒక్కో ఏటీఎంలో రూ.35లక్షలు పెట్టేవారు. ఇప్పుడు 2వేల నోట్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ సామర్థ్యం 60లక్షలకు పెరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క ఖాతాదారుడు రూ.50వేలను ఏటీఎం నుంచి తీసినా 120 మంది వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
రూ.5లక్షలకు పడిపోతే సందేశాలే. ఒక్కో ఏటీఎంలో రూ.60లక్షలు పెట్టవచ్చు. ఖాతాదారులు డ్రా చేయగా అందులోని నిల్వ రూ.5లక్షలకు దిగిపోతే వెంటనే బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్ సెల్ఫోన్లకు సందేశాలు వెళ్తాయి. అర్ధరాత్రయినా, సెలవులయినా వచ్చి బ్యాంకు తెరవాలి. లాకర్లలో నగదు తీసి ఏటీఎంలను నింపాలి.
ఈ విధానం ఇదివరకే అమల్లో ఉండేది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు దీనిపై పోరాటం చేయడంతో రద్దు చేశారు. మళ్లీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ విధానం అన్ని బ్యాంకులకూ వర్తిస్తుందా లేదా అన్న విషయాన్ని బ్యాంక్ వర్గాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నది.