పళనిస్వామే నన్ను మర్చిపోయాడా... విశ్వాసఘాతకుడంటూ రగిలిపోతున్న చిన్నమ్మ

శనివారం, 18 మార్చి 2017 (09:16 IST)
బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగలిపోతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితానికి  నెలరోజులు పూర్తయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి దినాల్లో పరామర్శకు వచ్చిన నేతలు క్రమేణా కనుమరుగయ్యారని ఆమె కోపంతో ఉన్నారు. నెలరోజుల్లో మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్‌ కామరాజ్‌  శశికళను చూసి వచ్చారు. ఆ తరువాత మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ బెంగళూరులో కలిశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎడపాడి పళనిస్వామి, కొందరు మంత్రులు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత రావాల్సిందిగా చిన్నమ్మ ఆదేశించడంతో ఆగిపోయారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత సీఎం ఎడపాడి చిన్నమ్మను మరిచిపోయారు. ఇప్పటి వరకు బెంగళూరు వెళ్లకపోవడం శశికళ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. సీఎం మాత్రమే కాదు కొన్ని రోజులుగా ఎవ్వరూ తనను చూసేందుకు రాకపోవడంపై శశికళ ఆసంతృప్తితో రగిలిపోతున్నారు.
 
పులిమీద పుట్ర అన్నట్లుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ భవిష్యత్తు ఏమిటో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. శశికళ ఎంపిక చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఈనెల 20వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం. శశికళ పదవి ఉండేనా ఊడేనా అనే చర్చతో అన్నాడీఎంకేలోని ఇరువర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 
 

వెబ్దునియా పై చదవండి