ఏకంగా ఒక టెస్ట్ సిరీస్‌లో ఓడిపోవడం అనేది ఏమాత్రం మింగుడపడని అంశమని భారత క్రికెట్ జట్టు ఓటమిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఈ మూడు టెస్ట్ మ్యాచ్‌లలో భారత ఆటగాళ్ల ఆటతీరు అత్యంత చెత్తగా ఉంది. దీంతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ ఓటమిని సగటు భారత క్రికెట్ అభిమానితో పాటు.. మాజీ క్రికెటర్లు సైతం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఈ ఓటమిపై సచిన్ టెండూల్కర్ స్పందించారు.
"స్వదేశంలో 0-3 తేడాతో ఓడిపోవడం అన్నది మింగుడు పడని విషయం. ఈ ఓటమి ఆత్మపరిశీలనకు పిలుపునిస్తోంది. ఈ పరాజయానికి కారణం సన్నద్ధత లోపమా, షాట్ ఎంపిక విఫలమవ్వడమా లేక మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమా?" అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.
ఇక యువ బ్యాటర్లు శుభమాన్ గిల్, రిషబ్ పంత్‌పై సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. శుభమాన్ గిల్ తొలి ఇన్నింగ్స్ నిలకడగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఇక రిషబ్ పంత్ అయితే రెండు ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. తన చక్కటి ఫుట్ వర్క్ సవాలుతో కూడిన పిచ్‌లు భిన్నంగా మార్చి చూపించాడని అన్నాడు.