శ్వేతసౌథంలో అల్లుడికి కీలక బాధ్యతలు కట్టబెట్టిన డోనాల్డ్ ట్రంప్

మంగళవారం, 10 జనవరి 2017 (10:53 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌథంలో తన కుటుంబ సభ్యులకు పెద్దపీట వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, తన అల్లుడు జరీడ్‌ కుష్నీర్‌కు కీలక పదవిని కట్టబెట్టారు. శ్వేతసౌథం సీనియర్‌ సలహాదారుడిగా ఆయనను నియమించారు. దీంతో మధ్యప్రాశ్చ్యం వ్యవహారాల్లో, వ్యాపార చర్చల్లో, దేశీయ, విదేశీ అంశాల్లో ఆయన పాత్ర కీలకం కానుంది. 
 
ట్రంప్ కుమార్తె ఈవాంక భర్త అయిన కుష్నీర్‌పై ఎన్నికల నాటి నుంచి ట్రంప్‌ ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇటీవల ట్రంప్‌ క్యాబినెట్‌ ఇంటర్వ్యూలకు, బ్రిటన్‌ విదేశాంగమంత్రి సమావేశంలో ఆయన సాయపడ్డారు. అలాగే, కుమార్తె ఇవాంక కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె తండ్రికి చేదోడువాదోడుగా కీలక పాత్ర పోషించారు. దీంతో ట్రంప్ తన కుటుంబ సభ్యులకు పెద్దపీట వేస్తున్నాడు. 
 
అయితే, అమెరికా చట్టాల్లో ఒక కీలక అంశం ఉంది. 1967లో చట్టం ప్రకారం కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసుకునే ఆచారంపై నిషేధం విధించింది. కానీ ఇది కుష్నీర్‌కు వర్తించదని సోమవారం ఆయన లాయర్‌ తెలిపారు. దీనికి తోడు ట్రంప్‌ కుష్నీర్‌కు మద్దతుగా ఒక ప్రకటన జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి