వెనక్కు పంపేది కోటిమందినే కదా.. అంత కలవరపడతారేంటి అంటున్న ట్రంప్ పప్పెట్

గురువారం, 23 ఫిబ్రవరి 2017 (04:59 IST)
అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను అందరినీ ఆయా దేశాలకు తిప్పి పంపుతామని దీనికి సంబంధించి ఏ కేటగిరీల వారికీ ఇక ఏమాత్రం మినహాయింపు ఉండదని అమెరికా అంతర్గత భద్రతా విభాగం (డీహెచ్ఎస్) పేర్కొంది. వలస చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానమున్న ఏ విదేశీయుడినైనా అరెస్ట్‌ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి ఈ విభాగ సిబ్బందికి పూర్తి అధికారాలు ఉంటాయని పేర్కొంది. అయితే అంతర్గత భద్రతా విభాగం ఇంత స్పష్టంగా అక్రమవలస దారులందరినీ వెనక్కు పంపేస్తామని చెబుతుంటే..  కొత్త మార్గదర్శకాల వల్ల విదేశీయులను భారీసంఖ్యలో పంపబోరని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ స్పష్టం చేయడం విచిత్రంగా ఉంది.  
 
ప్రస్తుత చట్టాలను అమలు చేయడానికి అధికారులకు అధికారాలివ్వడానికే వీటిని తెచ్చినట్లు వెల్లడించారు.  అక్రమ వలసదారులను వెళ్లగొట్టేందుకు డీహెచ్‌ఎస్‌ మంగళవారం రెండు ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. నేరచరిత ఉన్న విదేశీయులపై ప్రధానంగా దృష్టి సారించినా, ఇతరులను కూడా లక్ష్యం చేసుకున్నారు. దీంతో మొత్తం 1.1 కోట్ల మంది అనధికారిక వలసదారులను అమెరికా నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపే ప్రమాదం ఉంది. అంతకు మించి ట్రంప్ భారతీయులపై చేయి వేయడని ఎన్నారైలు పెట్టుకున్న నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా అమెరికాలో అనుమతి లేకుండా ఉంటున్న 3 లక్షల మంది భారతీయులు తప్పకుండా స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది.
 
అక్రమ వలసదారులను అమెరికానుంచి పంపించేందుకు ఫెడరల్‌ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను విస్తృతం చేస్తూ ట్రంప్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసి రంగం సిద్ధం చేశారు. అమెరికాలోని అక్రమ వలసదారుల్లో 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అనధికారిక అంచనా. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. అధికారిక పత్రాలు లేని వలసదారులపై, ప్రవేశ అర్హత లేదని తేలడానికి ముందు రెండేళ్లపాటు అమెరికాలో ఉండని వారిపై తక్షణ తొలగింపు నిబంధనలను అమలు చేయడానికి డీహెచ్‌ఎస్‌ సెక్రటరీకి అధికారం ఉంటుంది.
 
అయితే ఒంటరి మైనర్లకు, ఆశ్రయానికి దరఖాస్తు చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి, స్వదేశంలో వేధింపులు, చిత్రహింసల భయం ఉన్నవారికి, తమకు చట్టబద్ధ వలస హోదా ఉందని చెప్పేవారికి మినహాయింపు ఉంటుంది. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడం వల్ల వారు మళ్లీ అక్రమంగా రాలేరని ఉత్తర్వులో పేర్కొన్నారు. వారిని తక్షణం సొంత దేశాలకు అప్పగించడం వల్ల, జైళ్లు, న్యాయవ్యవస్థల వనరులను పొదుపు చేసుకుని ఇతర ప్రాధాన్య విదేశీయులకు కేటాయించడానికి వీలవుతుందని తెలిపారు.
 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన వివాదాస్పద వలస విధానాల ఫలితంగా 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు సహా మొత్తం 1.1 కోట్ల మంది అనధికారిక వలసదారులు బహిష్కరణను ఎదుర్కొనే అవకాశముంది. వీరిని దేశం నుంచి పంపించేందుకు ఫెడరల్‌ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను విస్తృతం చేస్తూ ట్రంప్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసి రంగం సిద్ధం చేశారు. ‘పంపించాల్సిన విదేశీయులకు సంబంధించి ఏ కేటగిరీల వారికీ ఇక ఎంతమాత్రం మినహాయింపు ఉండదు’ అని అంతర్గత భద్రత విభాగం(డీహెచ్‌ఎస్‌) తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
 

వెబ్దునియా పై చదవండి