ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్ నుంచి విడిపోయిన టెలినార్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్టెల్ రెడీ అవుతోంది. తద్వారా ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. ఫలితంగా టెలికాం రంగంలో మరో విలీనానికి తెరలేవనుంది.
ఈ కొనుగోలులో టెలినార్ ఇండియా ఆస్తుల బదలాయింపు అంశం కూడా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. మార్కెట్లో రిలయన్స్ జియో నుంచి వస్తోన్న పోటీ నేపథ్యంలో తమ మార్కెట్‌ను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఎయిర్ టెల్ ఈ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను తాము కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.