1500 రూపాయల ఫోన్. నెలకు 309 రూపాయల రీఛార్జ్ చేస్తే దేశవ్యాప్త వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత డేటా. ఈ ఆఫర్లన్నీ చాలవంటూ జియో టీవీకి యాక్సెస్. అంతేకాక మూడేళ్ల కాలంలో మొత్తం 1500 రీఫండ్. ఈ ప్రకటన వచ్చిన వెంటనే డిటిహెచ్, కేబుల్ కంపెనీల షేర్ల ధరలు కుదేలైపోయాయి. కానీ జియో ఫోన్ కేబుల్ టీవీ వచ్చినా డిటిహెచ్‌ల మనుగడకు ఎలాంటి ఢోకా ఉండబోదంటున్నారు నిపుణులు.
కారణమేంటంటే - జియోఫోన్ కేబుల్ ఒక క్యాస్టింగ్ సర్వీస్. దీనికి మిగతావాటికి తేడా ఏంటంటే ఇది క్యాథోడ్-రే ట్యూబ్ (సిఆర్‌టి) టీవీల్లోనూ పని చేస్తుంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో చూసేదాన్ని పెద్ద స్క్రీన్ ఉండే టీవీలకు బదిలీ చేయగలగడాన్నే క్యాస్టింగ్ అంటారు. ఇలాంటి సేవలను ఇప్పటికే గూగుల్, అమెజాన్ సంస్థలు క్రోమ్‌క్యాస్ట్, ఫైర్ స్టిక్ రూపంలో అందిస్తున్నాయి. కానీ వీటికి ఇప్పుడు జియో అందిస్తున్న సేవలకు తేడా వాటి ధరలు మాత్రమే. క్రోమ్‌క్యాస్ట్, ఫైర్ స్టిక్‌ల ధర సుమారు 3 నుండి 4 వేల రూపాయలు అయితే, జియో ఫోన్ కేబుల్ రూ.500 ఉండవచ్చు. అంటే ఫోన్ ధరతో కలిపి 2 వేల రూపాయలకు మించదు. ప్రస్తుతం డిడి ఫ్రీ డిష్ వంటి ఉచిత సేవ 100కు పైగా ఛానెళ్లను కేవలం 1500 ఖర్చుతో ఉచితంగా జీవితకాలంపాటు అందిస్తోంది.
ఇదిలా ఉండగా అసలు ఫోన్‌ను మూడు నుండి నాలుగు గంటలపాటు టీవీ చూసేందుకు ఎవరైనా వాడగలరా అంటున్నారు టీవీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోని నిపుణులు. ఒకవేళ ఆ వ్యక్తి బయటకో, ఆఫీసుకో వెళ్లవలసి ఉంటే (ఆ ఫోన్‌తో సహా) ఆ సమయంలో ఇంట్లో వాళ్లు టీవీ లేకుండా ఖాళీగా కూర్చోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సెట్-టాప్ బాక్స్‌లకు జియోఫోన్ ప్రత్యామ్నాయం కాదలచుకుంటే, ఉచిత డిష్ ఎస్‌టిబి ఇంకా తక్కువ ధరకే అందుబాటులో ఉంది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.