అన్నాడీఎంకేలో కుమ్ములాటలు.. లీకు వీరులు శశికళ వర్గీయులేనా?

గురువారం, 22 డిశెంబరు 2016 (08:57 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణమం తర్వాతం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫలితంగా ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని రుజువు చేసేలా రాష్ట్రంలో ఏదో జరుగుతోంది. కానీ ఏం జరుగుతోందో.. జరగబోతుందో ఊహకు కూడా అంతుచిక్కడం లేదు. 
 
మరోవైపు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేని అన్నాడీఎంకేను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కమలనాథులు కన్నేశారా? అనే ప్రశ్నా ఉదయిస్తోంది. దీనికితోడు అన్నాడీఎంకే నేతల్లో కుమ్ములాటలు మొదలయ్యాయా? సందేహం ఉత్పన్నమవుతోంది. కేంద్ర ఆదాయ పన్ను విభాగం.. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే టార్గెట్‌ చేయడం వెనుక కథ ఏంటి? ఇవీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్నలు. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడిగా ముద్రపడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌ రావు ఇంట్లో ఐటీ సోదాల వెనుక పెద్ద వ్యహారమే నడిచిందని అన్నాడీఎంకేలోని కొన్ని వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఇసుక మాఫియా లీడర్‌ కాంట్రాక్టర్ జే.శేఖర్‌ రెడ్డి ఇళ్లల్లో ఐటీ తనిఖీలతో మొదలైన వ్యవహారానికి రాజకీయ కోణం ఉన్నట్టుగా ఆ వర్గాలు పేర్కొంటున్నారు.
 
"వాస్తవానికి జయలలిత మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా శశికళకు అత్యంత నమ్మకస్తుడైన సీనియర్ నేత, పళనిస్వామిని ఎన్నుకోవాలని శశివర్గం పట్టుబట్టింది. అయితే, ప్రధాని మోడీ మాత్రం అందుకు సమ్మతించకుండా ఓపన్నీర్ సెల్వం వైపు మొగ్గుచూపారు. అయినప్పటికీ.. శశి వర్గం పట్టువీడలేదు. ఇది ప్రధానికి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. 
 
ఫలితంగా ఆదాయపన్ను శాఖ అధికారులు తొలుత సీనియర్‌ మంత్రి పళనిస్వామి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత జే.శేఖర్‌.రెడ్డి ఇళ్ళలో సోదాలు జరిగాయి. శేఖర్ రెడ్డి సమాచారాన్ని పళనిస్వామి వర్గీయులు ఐటీ విభాగానికి లీక్‌ చేసినట్టు వినికిడి. శేఖర్‌ రెడ్డి జయకు, ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు అత్యంత సన్నిహితుడు కావడమే ఇందుకు కారణం. 
 
అయితే, ఐటీ అధికారుల ముందు మొదట్లో కిమ్మనకుండా ఉన్న శేఖర్‌ రెడ్డి, మంగళవారం అర్థరాత్రి సీబీఐ అరెస్టు చేశాక అసలు గుట్టు విప్పాడు. దీంతో రామ్మోహన్ రావు వ్యవహారం బట్టబయలైంది. రామ్మోహన్‌ రావు, శేఖర్‌ రెడ్డి మధ్య ఇరవయ్యేళ్లుగా లావాదేవీలు నడిచినట్లు తెలుస్తోంది. పైగా, కొన్ని లావాదేవీల్లో వీరిద్దరికి మనస్పర్థలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే సీఎస్ వ్యవహారాన్నంతా ఆయన పూసగుచ్చినట్టు చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి