మేడిన్ ఇండియా రైఫిళ్లనే తిరస్కరించిన ఇండియన్ ఆర్మీ.. అంత దరిద్రంగా రూపొందించారా?

గురువారం, 22 జూన్ 2017 (07:03 IST)
భారత సాయుధ దళాల ప్రయోజనార్థం దేశీయంగా రూపొందించిన ప్రతిష్టాత్మకమైన అస్సాల్ట్ రైఫిల్‌ను తీసుకోను గాక తీసుకోనంటూ ఇండియన్ ఆర్మీ నిర్వంద్వంగా తిరస్కరించిది.  వరుసగా రెండో సారి ఇలా జరగడంతో ఇక దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఇన్సాస్ రైఫిళ్లను పక్కనబెట్టి అదే రకమైన ఆయుధాలను సేకరించాలని భారత సైన్యం నిర్ణయించుకుంది.



ఇషాపూర్‌లోని రైఫిల్ ఫ్యాక్టరీలో నిర్మించిన 7.62x51 ఎమ్ఎమ్ దేశీయ తుపాకులు గత వారం నిర్వహించిన ఫైరింగ్ పరీక్షలో ఘోరంగా విఫలం కావడంతో వాటిని ముట్టుకోవడానికి కూడా భారత సైన్యం నిరాకరించింది. ఈ దేశీయ తుపాకులలో లెక్కకు మించిన లోపాలు ఉన్నాయని, సైన్యం ఈ ఆయుధాలను ఉపయోగించాలంటే తుపాకి మేగజైన్‌ని పూర్తిగా కొత్తగా డిజైన్ చేయాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
 
నాణ్యతకు సంబంధించి అనుమతించదగిన ప్రమాణాలకంటే 20 రెట్లు ఎక్కువ లోపాలను ఈ కొత్త ఆయుధాలు కలిగిఉన్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. గత ఏడాది కూడా భారత సైన్యం 5.56 mm కాలిబర్ అని పిలిచే దేశీయంగా నిర్మించిన అసాల్ట్ రైఫిల్‌ను కూడా తీసుకోవడానికి నిరాకరించింది. తుపాకీని ప్రయోగించినప్పుడు ఎక్కువ ఫ్లాష్ రావడం, అధిక శబ్దం రావడం వంటి పలులోపాలను గమనించడంతో నాణ్యతా ప్రమాణాలకు చాలా దిగువ స్థాయిలో దేశీయ తుపాకి ఉన్నట్లు సైన్యం ప్రకటించింది.
 
సైన్యానికి ఆదునిక ఆయుధాల అవసరం ఎంతగానో ఉండగా దేశీయ తుపాకులపై నమ్మకం ఉంచి రెండేళ్లుగా ఆయుధాల కొరతను ఎదుర్కొంటుండటం సైనికాధికారులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో శుక్రవారం త్రివిద దళాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆయుధాలసేకరణపై చర్చించడానికి అత్యున్నత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 

వెబ్దునియా పై చదవండి