పఠాన్‌కోట్-2 దాడికి కుట్ర : హెచ్చరించిన నిఘా సంస్థలు

బుధవారం, 25 మే 2016 (11:21 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు మరోమారు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్టు భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి. ముఖ్యంగా.. పఠాన్‌కోట్‌లో గతంలో జరిగిన దాడి తరహాలోనే మరోమారు దాడి చేసేందుకు ప్లాన్ వేసినట్టు తెలిపాయి. ఇందుకోసం ఇప్పటికే భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్తో అన్ని ముఖ్యనగరాల్లో రెక్కీ నిర్వహిస్తోందని తెలిసింది. ఈ దాడిలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతోపాటు ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది.
 
ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన కమాండర్ అవాయిస్ మహ్మద్ త్వరలోనే మలేషియాకు పంపించి.. అక్కడ నుంచి భారత్‌లో అడుగుపెట్టేలా ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యక్తి పాకిస్థాన్కు చెందిన ఓకారా ప్రాంతవాసి అని తెలిపింది. ఇతడే ఇండియాలో రెండోసారి జరపబోయే దాడులకు నేతృత్వం వహిస్తాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థ హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి