మైసూరు మహారాజ వంశానికి 400 ఏళ్ల తర్వాత శాపవిముక్తి.. రాణి త్రిషీక కుమారి గర్భం ధరించింది..

శుక్రవారం, 16 జూన్ 2017 (15:02 IST)
మైసూరు మహారాజ వంశానికి శాపం నుంచి విముక్తి లభించింది. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్టణం రాజు శ్రీరంగరాయన భార్య అలమేలమ్మ శాపం రాజవంశానికి తగిలింది.  క్రీ.శ. 1610లో తిరుమలరాజ మైసూరు సింహాసనం ఏలుతుండగా, రాజ ఒడయార్‌ ఆయనపై తిరుగుబావుటా ఎగురవేసి, ఆయనను సింహాసనం నుంచి దించి రాజయ్యాడు.

నమ్మకద్రోహంతో ఆవేదనకు గురైన తిరుమలరాజ అతని భార్య అలమేలమ్మతో తలకాడు వెళ్ళిపోయాడు. అక్కడ తిరుమలరాజ మరణించడంతో అలమేలమ్మ ఒంటరైంది.
 
శత్రుశేషం ఉండకూడదని భావించి ఒడయారు సైనికులు ఆమెను వెతుక్కుంటూ తలకాడు చేరుకుని ఆమెను చుట్టుముట్టారు. ఆ సందర్భంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అలమేలమ్మ.. మైసూరు రాజవంశం నిలవదని.. ఆ ఇంట సంతాన భాగ్యం కలగదని శపించి కావేరి నదిలో దూకి తనువు చాలించినట్లు చరిత్ర చెప్తోంది.

ఆమె శాపం మహత్యమో, లేక మరేదైనా కారణమో గానీ అప్పటి నుంచి నేటి వరకు పట్టాభిషక్తులైన వారంతా సంతానయోగం లేక మనోవేదనకు గురయ్యారు.  దీంతో సమీప బంధువుల్లోని యోగ్యుడైన మగపిల్లాడ్ని ఎంపిక చేసి, దత్తత తీసుకుని రాజవంశ వారసునిగా ప్రత్యేకపూజలు నిర్వహించి, అభిషేకం చేసి మైసూర్ మహారాజుగా ప్రకటించడం ఆనవాయితీ. 
 
ఈ నేపథ్యంలో మైసూర్ మహారాజుగా పట్టాభిషక్తుడైన యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు గత జూన్ 27న త్రిషీక కుమారితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో త్రిషీక కుమార్ గర్భం ధరిస్తుందని, మగపిల్లవాడే పుడతాడని జ్యోతిష్కులు జోస్యం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కావడంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలు మరింత అంగరంగ వైభవంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 400 ఏళ్ల తర్వాత అలమేలమ్మ శాపం నుంచి ఒడయార్ కుటుంబానికి విముక్తి లభించిందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి