ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రేస్ : రాజ్‌నాథ్ సింగ్ వర్సెస్ మనోజ్ సిన్హా.. 4 గంటలకు ఫైనల్
శనివారం, 18 మార్చి 2017 (09:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్నది శనివారం సాయంత్రం 4 గంటలకు తేలిపోనుంది. ఇందుకోసం ఆ పార్టీ శాసనసభాపక్షం శనివారం ఉదయం సమావేశం కానుంది. కేంద్ర పరిశీలకులు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడిస్తారు.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పదవిలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే, టెలికం శాఖల సహాయ మంత్రిగా పనిచేస్తున్న మనోజ్‌సిన్హా పేర్లు తుది పోటీలో నిలిచాయి. వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే, రాజకీయంగా బీజేపీకి యూపీ అత్యంత కీలకమైన రాష్ట్రం. దీంతో ఆ రాష్ట్ర సీఎం పదవికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి అనుభవం ఉన్న నేతలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు అమిత్ షాలు భావిస్తున్నారు. దీంతో ఆయన పేరు మొదటి వరుసలో ఉంది.
అయితే, ప్రధాని మోడీ సొంత లోక్‌సభ స్థానం వారణాసి బాధ్యతలు నిర్వహిస్తున్న మనోజ్ సిన్హా కూడా గట్టి పోటీనిస్తున్నారు. ఈయన లోక్‌సభకు మూడుసార్లు ఎన్నిక కావడంతోపాటు ప్రస్తుతం రైల్వే, టెలికం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్న మనోజ్ సిన్హాను బీజేపీ నాయకత్వం యూపీ సీఎంగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయన ఐఐటియన్ కావడంతోపాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి కూడా. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.
అదేసమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత భావాలు గల నేతగా ఆయనకు పేరున్నది. కానీ రాజకీయ నాయకుడిగా, అనుభవం గల నేతగా ఆయన అవసరాలు కేంద్రంలో ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వం ఉత్తరప్రదేశ్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థి ఎవరన్న విషయం ప్రకటించే అవకాశముంది.
దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఓబీసీలు, యాదవ్‌లు, దళితులు, అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణులు, రాజ్పుత్రులు, జాట్లతోపాటు ముస్లింలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రకాల సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీఎంను ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.