దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం వల్లే కరెన్సీ విలువ పడిపోతుందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. హిట్లర్, ముస్సోలినీ కూడా శక్తివంతమైన బ్రాండ్లేనని వ్యంగ్యంగా అన్నారు.
ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్ తాజా కేలండర్‌లో గాంధీకి బదులుగా ప్రధాని మోడీ ఫొటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి అనిల్ విజ్ స్పందించారు. "ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటెంట్ లేదు. ఖాదీకి గాంధీ పేరును లింకు చేసినప్పటి నుంచే పరిశ్రమ పతనమైపోయింది. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై వేసినప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడమే కానీ పెరగడం లేదు" అని విజ్ వ్యాఖ్యానించారు.