ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేపట్టరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అలాగే, ఆయా ప్రభుత్వం తమ వంతు మేరకు మరుగుదొడ్లను నిర్మిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి మరుగుదొడ్డి నిర్మించుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
బరేలీ జిల్లాకు చెందిన గులారియా భవానీ అనే 31 ఏళ్ల మహిళకు భర్త ఇద్దరు పిల్లలున్నారు. తాము నివాసమున్న గ్రామం అటవీ ప్రాంతంలో ఉండటంతో ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెట్లలోకి వెళ్లాలంటే వన్యప్రాణులతో ప్రమాదాలు పొంచివున్నాయి. దీంతోపాటు వర్షాల వల్ల మైదానంలో నీరు నిలచి ఉండటం వల్ల అవస్థలు పడాల్సి వస్తున్నందున ఎలాగైనా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని స్థిర నిర్ణయానికి వచ్చానంటారు.
ఇందుకోసం ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. కానీ, వారి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఆరువేల రూపాయల వడ్డీకి రుణం తీసుకొని తన వద్ద ఉన్న మరో వేయి రూపాయలు కలిపి ఏడువేలతో భవానీ ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది.