తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం ఇళ్లు రెడీ... సచివాలయాలు కూడా...
బుధవారం, 7 మే 2014 (13:13 IST)
FILE
ఎన్నికలు ముగుస్తున్నాయి. మరోవైపు జూన్ 2నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల మధ్య భవనాల పంపకానికి ఆమోద ముద్ర వేశారు. ఆ వివరాలను చూస్తే... రాజధాని హైదరాబాదులో మొత్తం 179 కార్యాలయాల భవనాల కేటాయింపులు చేశారు. తెలంగాణకు సచివాలయంలో ఎ,బి,సి,డి బ్లాకులు కేటాయించారు.
అలాగే తెలంగాణ శాసనసభకు ప్రస్తుత శాసనసభను, జూబ్లీహాలను శాసనమండలికి, సి-బ్లాకులోని ప్రస్తుత కార్యాలయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, బేగంపేటలోని ప్రస్తుత కార్యాలయంలోనే టి.సీఎం అధికారిక నివాసాన్ని, బంజారాహిల్స్ లోని 13 గృహాలను మంత్రుల నివాస గృహాలకు, ప్రస్తుత క్వార్టర్లలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వసతి గృహాలను కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) విషయానికి వస్తే... సచివాలయానికి హెచ్,జె,కె,ఎల్ బ్లాకులు కేటాయించారు. పాత అసెంబ్లీ భవనాన్ని ఏపీ శాసనసభకు, ప్రస్తుత భవనాన్ని శాసనమండలికి, హెచ్-బ్లాకు ఏపీ సీఎంకు, సోమాజిగూడలోని లేక్ వ్యూ అతిథి గృహం ఏపీ సీఎం అధికారిక నివాసంగానూ, బంజారాహిల్స్ లోని 18 గృహాలు ఏపీ మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రస్తుత క్వార్టర్లలోనే కేటాయిస్తూ గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.