ఈ కాలభైరవ నాథునిని తమ నగరాన్ని సంరక్షించే దేవుడిగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. కాకపోతే మద్యం సేవించడమే ఈ దేవుడి ప్రత్యేకత. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
కాలభైరవుని క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కావలాదారి. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద ఉంచుతారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ అనురక్తితో సాకినట్లయితే పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే.