తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహం చేసుకుని, ఒక్కటి అవ్వాలనుకునే జంటలు ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్ సెంటర్ లో టిటిడి సేవా ఆన్‌లైన్. కామ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదు చేయాలి.
వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమే కాక ఓటర్, ఆధార్ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాలి. వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ లేదా మార్క్‌లిస్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్ పత్రం జారీ అవుతుంది.
కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి. అనంతరం వారికి పురోహితుడు, మంగళవాయిద్యంతో పాటు అవసరమైనచో రోజుకు రూ.50 చెల్లించే వసతి గృహాన్ని, పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను టిటిడి ఉచితంగా అందిస్తారు.
వివాహం అనంతరం
నవదంపతులకు గ్రూప్ ఫోటో తీసి రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు. ఈ టికెట్ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. వివాహం చేసుకునే దంపతులు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా కల్యాణవేదిక వద్ద పెళ్లి చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టిటిడి తెలిపింది.